మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగ.. ఆర్‌సీబీకి భారీ మూల్యం

7 Apr, 2021 10:52 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై పదునైన వ్యాఖ్యాలు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఏ ఐపీఎల్‌లోనూ స్థిరంగా ఆడలేదని.. అందుకే అతను లీగ్‌లో అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడంటూ పేర్కొన్నాడు.

ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గంభీర్‌ మాట్లాడుతూ.. ''ఆర్‌సీబీ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. కానీ మ్యాక్స్‌వెల్‌ వారికి నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్‌లో పంజాబ్‌ తరపున  మ్యాచ్‌ల్లో  108 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగ. అతని వల్ల ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకోనుంది. నిజానికి ఏ ఐపీఎల్‌ సీజన్‌లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు. ప్రతీ సీజన్‌లో అతను ఆడుతున్నాడని చాలా మంది పొరబడుతున్నారు.. వాస్తవానికి అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడు. ఒక్క 2014 మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడు చూడలేదు.

అతను ఆసీస్‌ జట్టుతో పాటు అక్కడి లీగ్‌ల్లో మాత్రమే ఆడుతాడు తప్ప ఐపీఎల్‌లో అతనిపై కోట్ల వర్షం కురిపించినా ఆడడు. ఈ విషయం తెలియక మ్యాక్సీని ఆర్‌సీబీ వేలంలో రూ. 14.25 కోట్లు పెట్టి తీసుకుంది. మ్యాక్సీ తరహాలోనే విధ్వంసకర ఆటగాడైన ఆండ్రీ రసెల్‌ మాత్రం కేకేఆర్‌కు మాత్రమే ఎందుకు కొనసాగుతున్నాడు. అతను ప్రతీ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టే కేకేఆర్‌ అతన్ని రిలీజ్‌ చేయడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఈ సీజన్‌లోనైనా మ్యాక్సీ మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌లాడి 1505 పరుగులు సాధించాడు. కాగా గంభీర్‌ నేతృత్వంలోనే కేకేఆర్‌ రెండు సార్లు(2012, 2014) ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

చదవండి: ఐపీఎల్‌లో నో చాన్స్‌.. అందుకే కౌంటీ క్రికెట్

జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. మరి టైటిల్ సంగతేంటి!

>
మరిన్ని వార్తలు