ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు: వార్నర్‌

12 Apr, 2021 08:03 IST|Sakshi

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయకపోవడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు. ఇక్కడి పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకుని కేకేఆర్‌ పరిస్థితుల్ని విజయం సాధించిందన్నాడు. మ్యాచ్‌ అనంతరం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన వార్నర్‌.. ఈ పిచ్‌పై పరుగుల వరద పారడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు ఇన్ని పరుగులు ఈ వికెట్‌పై వస్తాయని అనుకోలేదన్నాడు. ‘పరుగులు భారీగా వచ్చాయి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకున్నది ఒకటి.. జరిగింది ఒకటి.

ఏది ఏమైనా ఇక్కడ వికెట్‌పై పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్న కేకేఆర్‌ గెలుపును సొంతం చేసుకుంది. మంచి భాగస్వామ్యాలు నమోదు చేశారు. మా ప్రణాళికల్ని అమలు చేయలేకపోయాం. ఆరంభం నుంచి చివరి వరకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మనీష్‌-బెయిర్‌ స్టో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో మాకు చాన్స్‌ దొరికిందని అనుకున్నాం. ఇక్కడ పిచ్‌పై ఉన్న డ్యూ (తేమ) కాస్త భిన్నంగా ఉంది. బౌలర్లు ఓవర్‌ పిచ్‌ బంతులు వేస్తే ఈజీగా హిట్‌ చేయడం అనేది కనిపించింది. సీమ్‌ విభాగంలో మా కంటే కేకేఆర్‌ మెరుగ్గా కనిపించింది. ఈ మ్యాచ్‌ గెలవాల్సింది.. కానీ ఓడిపోయాం. ఇంకా ఈ వేదికలో నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఇక్కడ గ్రౌండ్‌లో ఎలా ఆడాలనే దాన్ని మిగతా మ్యాచ్‌ల్లో ఉపయోగించుకుంటాం‘ అని వార్నర్‌ తెలిపాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది. కేకేఆర్‌ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ చివరి అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మనీష్‌‌ పాండే (61 నాటౌట్‌) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. డేవిడ్‌ వార్నర్‌ (3) ఆదిలోనే నిష‍్రమించగా, ఆపై సాహా (7) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో బెయిర్‌ స్టో-మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను‌ చక్కదిద్దారు.

ఈ జోడి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది. కాగా, బెయిర్‌ స్టో ఔటైన తర్వాత మనీష్‌ పాండేపై భారం పడింది. పాండే పోరాడినా పరాజయం తప్పలేదు. సన్‌రైజర్స్‌ 177 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 187 పరుగులు చేసింది. నితీష్‌ రానా (80), రాహుల్‌ త్రిపాఠి (53) హాఫ్‌ సెంచరీలతో రాణించగా, దినేశ్‌ కార్తీక్ ‌(22 నాటౌట్‌; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు నమోదు చేసింది.
(చదవండి: ‘సన్‌’ సత్తా సరిపోలేదు)

మరిన్ని వార్తలు