కేకేఆర్‌ అరుదైన ఫీట్‌.. మూడో జట్టుగా రికార్డు

12 Apr, 2021 15:13 IST|Sakshi

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 187 పరుగులు చేయగా, ఆపై ఎస్‌ఆర్‌హెచ్‌ను 177 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఐపీఎల్‌లో 100వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది కేకేఆర్‌. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ చరిత్రలో  100 విజయాలు సాధించిన మూడో జట్టుగా కేకేఆర్‌ అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది.  

అంతకుముందు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకూ 120 విజయాలు సాధించగా, సీఎస్‌కే 106 విజయాలను సొంతం చేసుకుంది. వీటి తర్వాత వంద విజయాల మార్కును చేరిన జట్టుగా కేకేఆర్‌ నిలిచింది.  తన జట్టు వందో విజయాన్ని సాధించడంతో కేకేఆర్‌ సహ యాజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్ ట్వీటర్‌ వేదికగా, స్పందించారు. '100వ ఐపీఎల్ మ్యాచ్ గెల‌వ‌డం సంతోషంగా ఉంది. అంతా బాగా ఆడారు’ అని పేర్కొన్న షారుక్‌.. ఒక్కో ప్లేయర్‌ పేరును ప్రత్యేకంగా ట్యాగ్‌ చేశారు. 

కేకేఆర్‌ నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ గెలుపు అంచుల వెళ్లి చతికిలబడింది. బెయిర్‌ స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మనీష్‌‌ పాండే (61 నాటౌట్‌) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. డేవిడ్‌ వార్నర్ ‌(3) ఆదిలోనే నిష‍్రమించగా, ఆపై సాహా (7) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో బెయిర్‌ స్టో-మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది. కాగా, బెయిర్‌ స్టో ఔటైన తర్వాత మనీష్‌ పాండేపై భారం పడింది. పాండే పోరాడినా పరాజయం తప్పలేదు.  ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 188 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  నితీష్‌ రానా (80), రాహుల్‌ త్రిపాఠి (53) హాఫ్‌ సెంచరీలతో రాణించగా, దినేశ్‌ కార్తీక్ ‌(22 నాటౌట్‌; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు నమోదు చేసింది.

ఇక్కడ చదవండి: ‘సన్‌’ సత్తా సరిపోలేదు 

సన్‌రైజర్స్‌ చేసిన తప్పిదం అదేనా?

మరిన్ని వార్తలు