రోహిత్‌ శర్మకు భారీ షాక్‌.. రూ. 12 లక్షల జరిమానా!

21 Apr, 2021 12:13 IST|Sakshi
ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌, ధవన్‌తో రోహిత్‌ శర్మ(Photo Courtesy: MI Twitter)

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీగా జరిమానా విధించారు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కనీస ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేయని కారణంగా 12 లక్షల రూపాయల ఫైన్‌ వేస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు.. ఈ సీజన్‌లో రోహిత్‌ సేన తొలి తప్పిదంగా భావించి జరిమానాతో సరిపెడుతున్నట్లు పేర్కొంది.

కాగా ఐపీఎల్‌ మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, మరోసారి అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి గనుక ఇలాగే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, అదే విధంగా తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

ఇక మంగళవారం నాటి మ్యాచ్‌లో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అద్భుతంగా రాణించడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్‌ సేన, 19.1 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగు వికెట్లతో రాణించిన అమిత్‌ మిశ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

స్కోర్లు: ముంబై ఇండియన్స్‌- 137/9 (20)
ఢిల్లీ క్యాపిటల్స్‌- 138/4 (19.1)  

మరిన్ని వార్తలు