IPL 2021: ఈ మ్యాచ్‌లోనే పొలార్డ్‌ సాధిస్తాడా?

9 Apr, 2021 16:28 IST|Sakshi
కీరోన్‌ పొలార్డ్‌(ఫైల్‌ఫోటో); ఫోటో కర్టసీ-బీసీసీఐ

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌-14 రెండు పటిష్టమైన బ్యాటింగ్‌ కల్గిన జట్లతో ఆరంభం కానుండటంతో ప్రేక్షకులు మంచి మజాను ఆస్వాదించడం ఖాయం. డిఫెండింగ్‌ చాంపియన్ ముంబై ఇండియన్స్‌‌-రాయల్‌ చాలెంజర్స్‌  బెంగళూరు జట్లు ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో తలపడుతుండటంతో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌ల పవర్‌ఫుల్‌ స్ట్రోక్స్‌పై ఆసక్తి నెలకొంది. కాగా, పొలార్డ్‌ మాత్రం అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇంకా రెండు సిక్స్‌లు కొడితే రోహిత్‌, కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌, ఎంఎస్‌ ధోనిల సరసన చేరిపోతాడు పొలార్డ్‌. ఓవరాల్‌గా 200 ఐపీఎల్‌ సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి పొలార్డ్‌ ఇంకా రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 198 ఐపీఎల్‌ సిక్స్‌లు సాధించిన పొలార్డ్‌.. ఆర్సీబీతో జరుగనున్న తొలి మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. స్వతహాగా హార్డ్‌ హిట్టర్‌ అయిన పొలార్డ్‌.. తన బ్యాట్‌కు పని చెబితే సిక్సర్ల కింగ్స్‌ సరసన చేరిపోతాడు. 

ఈ జాబితాలో గేల్‌(349), ఏబీ డివిలియర్స్‌(235), ఎంఎస్‌ ధోని(216), రోహిత్‌ శర్మ(213), విరాట్‌ కోహ్లి(201)లు వరుస స్థానాల్లో ఉన్నారు.  గత ఐపీఎల్‌ సీజన్‌లో పొలార్డ్‌ 16 మ్యాచ్‌ల్లో 22 సిక్స్‌లు సాధించాడు.  ఇక బ్యాటింగ్‌లో 53.60 యావరేజ్‌తో 268 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌ 2020లో పొలార్డ్‌ అత్యధిక స్కోరు 60 నాటౌట్‌.  మరొకవైపు పొలార్డ్‌ నాలుగు ఫోర్లు కొడితే ఐపీఎల్‌ 200 ఫోర్ల మార్కును చేరతాడు. ప్రస్తుతం పొలార్డ్‌ ఖాతాలో 196 ఐపీఎల్‌ ఫోర్లు ఉన్నాయి.  ఈ రెండు రికార్డులు కూడా పొలార్డ్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లోనే సాధిస్తాడో లేదో చూడాలి. ఇక ఏడు వికెట్లు సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో 300 వికెట్ల మార్కును పొలార్డ్‌ చేరతాడు.  

అదే సమయంలో​ టీ20 ఫార్మాట్‌లో మూడొందల వికెట్లను, 5వేలకు పైగా పరుగులు చేసిన నాల్గో ఆల్‌రౌండర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో డ్రేన్‌ బ్రేవో; షకీబుల్‌ హసన్‌, ఆండ్రీ రసెల్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.  ఈ ఐపీఎల్‌లో 10 క్యాచ్‌లో పడితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు పొలార్డ్‌. ఇక టీ20 ఫార్మాట్‌లో 700 ఫోర్లు పూర్తి చేసుకోవడానికి 25 ఫోర్ల దూరంలో ఉన్నాడు ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌.

మరిన్ని వార్తలు