ఐపీఎల్‌ అఫీషియల్‌ పార్ట్‌నర్‌గా అప్‌స్టాక్స్‌!

16 Mar, 2021 16:07 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 అధికారిక భాగస్వామిని బీసీసీఐ ప్రకటించింది. డిజిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అప్‌స్టాక్స్‌, క్యాష్‌ రిచ్‌లీగ్‌ అఫీషియల్‌ పార్టనర్‌గా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాలక మండలి నేడు అప్‌స్టాక్స్‌ను తమ భాగస్వామిగా ప్రకటించింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న ఈ డిజిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ ఐపీఎల్‌ భాగస్వామిగా ఉంటుంది. ఇది కేవలం ఒక్క ఏడాదికే పరిమితం అయ్యే ఒప్పందం కాదు’’ అని మీడియాతో పేర్కొంది. ఈ విషయం గురించి ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. లీగ్‌ అఫీషియల్‌ పార్టనర్‌గా అప్‌స్టాక్స్‌ ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న, విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్‌- డిజిటల్‌ రంగంలో దూసుకుపోతున్న అప్‌స్టాక్స్‌ ఒప్పందం సరికొత్త ప్రయాణానికి నాంది పలికిందని తెలిపారు. 

అదే విధంగా, ఆర్థికంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనే యువతకు అప్‌స్టాక్స్‌ మంచి దిక్సూచిగా మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. ఇక అప్‌స్టాక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రవి కుమార్‌, బీసీసీఐతో ఒప్పందం తమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో క్రికెట్‌ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, భారతీయుల సంస్కృతీ, సంప్రదాయాలు, సామాజిక జీవనంలో ఒక భాగమని పేర్కొన్నారు. ముఖ్యంగా మిలియనీల్స్‌(గత రెండు దశాబ్దాల్లో జన్మించిన వాళ్లు)పై ఐపీఎల్‌ ప్రభావం ఎక్కువగా ఉందని, అలాంటి లీగ్‌కు భాగస్వామిగా వ్యవహరించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ సరికొత్త కలయికతో దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్‌-2021 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా!

మరిన్ని వార్తలు