Kitchen Garden: పది నెలలుగా ఇంటి కూరగాయలే 

16 Mar, 2021 16:04 IST|Sakshi

లాక్‌డౌన్‌ కాలంలో కిచెన్‌ గార్డెన్‌ కు శ్రీకారం

గ్రోబాగ్స్, కుండీలతో పాటు హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో ఆకుకూరలు సాగు

చుట్టూ పచ్చని వాతావరణం.. ఉదయం లేవగానే పలకరించే పూలు.. తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... ఇవన్నీ పట్టణంలోనే మన ఇంటిపైనే అందుబాటులోకి తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది.

డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్‌లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్ధగా c‌ను ఏర్పాటు చేసుకున్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. వేదప్రకాశ్‌ పనిచేస్తున్నారు. 280 చదరవు గజాల ఇంటి పైకప్పుపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు. ఇటు కుండీలు, గ్రోబాగ్స్‌లోను.. అటు హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలోనూ ఇంటిపంటలు సాగు చేసుకొని పది నెలలుగా తింటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పది నెలల క్రితం డా. వేదప్రకాశ్‌ ఈ మిద్దె తోటకు శ్రీకారం చుట్టారు. కోతుల నుంచి కాపాడుకునేందుకు ఇనుప జాలీని ఏర్పాటు చేస్తూ ఇంటికి కావలసిన కూరగాయలన్నీ పండిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలను బందువులు, స్నేహితులకూ రుచి చూపిస్తున్నారు. వేదప్రకాశ్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంటి పంటల సాగు పనులు చూసుకుంటున్నారు. 

32 రకాల కూరగాయల సాగు
వేదప్రకాశ్‌ ఇంటి పైకప్పుపై 32 రకాల కూరగాయలు సాగవుతున్నాయి. బీర, కాకర, దోస, గుమ్మడి, చిక్కుడు, సోరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, టమాట, చిక్కుడు, మిర్చి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఆలు, ఇలాయిచీ వంటివి పండిస్తున్నారు. అలాగే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బచ్చలి, బిర్యానీ ఆకును అక్కడ పండిస్తున్నరు. అలాగే మామిడి, అరటి, యాపిల్‌ చెర్రీ, వాటర్‌ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, సింగపూర్‌ చెర్రి, జామ, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్స్, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బాదాం, పనస, మునగ వంటి పండ్లు, కాయల చెట్లు పెంచుతున్నారు. 

అప్పటి నుంచి మార్కెట్‌కు వెళ్ల లేదు
వేదప్రకాశ్‌ తన ఇంటిపైకప్పుపై పండిస్తున్న కూరగాయలు వాళ్ల ఇంటి అవసరాలకే కాకుండా, ఇరుగు పొరుగు వారికి, బంధువులు, స్నేహితులకు ఇస్తున్నారు. గడచిన పది నెలలుగా మార్కెట్‌లో అడుగు పెట్టలేదని కిరణ్మయి తెలిపారు. ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు అక్కడే లభిస్తున్నాయి. మార్కెట్లో లభించనివి కూడా మిద్దెపై అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఈ రోజు ఏ కర్రీ వండుకోవాలో మిద్దెపైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు. క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకుని వెళ్లి వండుకోవడం జరుగుతోంది. 

ఇంటిపంటల మధ్య వెదురు బొంగులతో వేసిన కుటీరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. పండుగల పూట, బంధువులు, స్నేహితులు వచ్చినపుడు అందరూ అక్కడే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాల మద్యన విందులు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వెళ్లినా మిద్దెపైకి తీసుకువెళ్లి అంతా చూయిస్తారు. తిరిగి వెళ్లేటపుడు కూరగాయలు కత్తిరించి చేతిలో పెట్టి పంపించడం వాళ్లకు ఆనవాయితీగా మారింది. 
– ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

పంట చేలో ఉన్నంత ఆనందం
మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. పది నెలల కాలంగా మార్కెట్‌కు వెళ్లే అవసరం రాలేదు. ఇంట్లో అందరం పొద్దున లేస్తే చాలు మిద్దెపైకి రావడం, మొక్కలకు నీళ్లు పట్టడం, వాటì ని చూసుకోవడం అలవాటైంది. మనకు కావలసిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో మాకు అర్థమైంది. ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నాం. పండుగల సందర్భంగా అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తుంటే పంట చేను దగ్గర తిన్నంత తృప్తి కలుగుతోంది.
– డాక్టర్‌ వేదప్రకాశ్‌ (95531 81399), కామారెడ్డి 

మరిన్ని వార్తలు