ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌: అతన్ని ఆడించకపోవడం ఉత్తమం

27 Apr, 2021 16:24 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగునున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మ్యాచ్‌ ఫ్రివ్యూ గురించి మాట్లాడుతూ ఆర్‌సీబీ ఆటగాడు డేనియల్‌ క్రిస్టియన్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. 

''ఢిల్లీతో మ్యాచ్‌కు డేన్‌ క్రిస్టియన్‌ను ఆడించకపోవడం ఉత్తమం. అతని స్థానంలో డేనియల్‌ సామ్స్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది. నిజానికి క్రిస్టియన్‌ మంచి ఆల్‌రౌండర్‌.. బిగ్‌బాష్‌ లాంటి టోర్నీలో చక్కగా రాణించి ఆయా జట్లు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అతని ఆటను చూసిన ఆర్‌సీబీ ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని క్రిస్టియన్ చూపించలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు పరుగులు చేయగా.. ఇక బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు క్రిస్టియన్‌ స్థానంలో డేనియల్‌ సామ్స్‌ను తీసుకుంటే బాగుంటుంది. సామ్స్‌ బ్యాటింగ్‌ చేయడంతో పాటు లెఫ్టార్మ్‌ మీడియం పేస్‌ వేయగలడు. ఈ సీజన్‌ ప్రారంభంలో కరోనా బారీన పడిన అతను పూర్తిగా కోలుకొని సిద్ధమయ్యాడు. ఇక సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ ఆర్డర్‌. కోహ్లి, పడిక్కల్‌లు ఓపెనర్లుగా వస్తున్నా.. మూడో స్థానంలో రజత్‌ పాటిధార్‌కు అవకాశమివ్వాలి. నాలుగు, ఐదు స్థానాల్లో డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ ఉంటారు.. ఇక ఆరో స్థానంలో సుందర్‌ లేదా డేనియల్‌ సామ్స్‌ రావాలి. కచ్చితమైన ప్లాన్‌తో దిగితే మాత్రం నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై పైచేయి సాధిస్తుంది. ''అంటూ తెలిపాడు. ఇక ఆర్‌సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి.. ఒకదానిలో ఓడి మూడో స్థానంలో ఉండగా..  ఇక ఢిల్లీ కూడా అన్నే మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉంది.
చదవండి: ఆ ఇద్దరికి కోచ్‌ అవసరం లేదు

మరిన్ని వార్తలు