DC Vs SRH: ఈ మ్యాచ్‌లో ఓడిపోయారో మీ పని ఇక అంతే: టీమిండియా మాజీ బ్యాటర్‌

5 May, 2022 13:49 IST|Sakshi
ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs SRH: ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగింట మాత్రమే గెలుపొందింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే పంత్‌ సేన నెట్‌రన్‌ రేటు పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వరుస ఓటములు కలవరపెట్టే అంశంగా పరిణమించాయి. మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బతీస్తోంది. 

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం జరుగనున్న మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ అజయ్‌ జడేజా, మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఢిల్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్‌ జడేజా.. ‘‘ఈ మ్యాచ్‌ ఢిల్లీకి ఎంతో కీలకమైనది. మిగతా జట్ల కంటే ఢిల్లీ ఒకే ఒక్క మ్యాచ్‌ తక్కువగా ఆడింది. కానీ వాళ్లకు ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

ఒకవేళ వాళ్లు ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించినా.. ఇతర జట్లతో కలిసి సంయుక్తంగా 10 పాయింట్లతో నిలుస్తారు. అందుకే ఈ మ్యాచ్‌ గెలవడం ఢిల్లీకి అత్యంత ముఖ్యం. ఇటీవలి మ్యాచ్‌లను పరిశీలిస్తే వాళ్లకు పెద్దగా కలిసి రావడం లేదు.  ఈ మ్యాచ్‌ కూడా ఓడిపోయారంటే.. ఈ సీజన్‌లో వారి ప్రయాణం ముగింపునకు వచ్చినట్లే అవుతుంది’’ అని పేర్కొన్నాడు.

ఇక సెహ్వాగ్‌ ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ‘‘ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు పర్లేదు. కానీ మిడిలార్డర్‌ బ్యాటర్లు ఇంకా కూడా కుదురుకోలేకపోతున్నారు. పరుగులు సాధించలేకపోతున్నారు. ఇక అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో కూడా బౌలర్లు విఫలమవుతున్నారు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్‌ తొమ్మిదింట 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడగా.. ఢిల్లీ.. లక్నో చేతిలో ఓటిమిని మూటగట్టుకుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ మరింత కీలకంగా మారగా... గెలిచి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాయి.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 50: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌
వేదిక: బ్రబౌర్న్‌ స్టేడియం, ముంబై
సమయం: రాత్రి 07:30 నిమిషాలకు ఆరంభం

చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’

మరిన్ని వార్తలు