IPL 2022 Eliminator LSG Vs RCB: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం వాళ్లదే.. కారణమిదే: టీమిండియా మాజీ క్రికెటర్‌

25 May, 2022 13:54 IST|Sakshi
లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆర్సీబీ సారథి డుప్లెసిస్‌ (ఫైల్‌ ఫొటో: కర్టెసీ-IPL)

IPL 2022 Eliminator LSG Vs RCB Winner Prediction: ఐపీఎల్‌-2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బుధవారం(25) నాటి పోరుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. 

ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌-1లో ఓడిన రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫైయర్‌-2లో గనుక గెలుపొందితే గుజరాత్‌ టైటాన్స్‌తో పాటు ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్‌ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా ప్లే ఆఫ్స్‌ చేరిన ఆర్సీబీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన లక్నో విజయంపై కన్నేశాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, వివాదాస్పద వ్యాఖ్యాతగా పేరొందిన సంజయ్‌ మంజ్రేకర్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతను అంచనా వేశాడు. లక్నో మీద ఆర్సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘బెంగళూరుకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వాళ్లకు స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు. ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఐపీఎల్‌ రికార్డు ఓసారి చూడండి. ప్లే ఆఫ్స్‌లో అతడు మరింతగా రెచ్చిపోతాడు. ఇక విరాట్‌ కోహ్లి కూడా గేరు మార్చాడు.  అనుభవం కలిగిన ఆర్సీబీ జట్టు ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు. కాబట్టి వాళ్లు గెలుస్తారు’’ అని అభిప్రాయపడ్డాడు.

కాగా గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫాఫ్‌.. ఫైనల్లో కేకేఆర్‌పై 59 బంతుల్లో 86 పరుగులు చేసి తమ జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు.

చదవండి👉🏾IPL 2022 Eliminator LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. కీలక మ్యాచ్‌ తుదిజట్ల అంచనా
చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!

మరిన్ని వార్తలు