Tilak Varma: మ్యాచ్‌ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు

2 Apr, 2022 20:24 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్న ఈ తెలుగుతేజం శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్‌ వర్మకు ఐపీఎల్‌లో ఇదే డెబ్యూ అర్థసెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన అతి పిన్న వయస్కుడుగా  తిలక్‌ వర్మ(19 ఏళ్ల 145 రోజులు) రికార్డు కూడా అందుకున్నాడు.


Courtesy: IPL Twitter
కాగా అంతకుముందు ఇషాన్ కిషన్ (19 ఏళ్ల 278 రోజులు) 2018 సీజన్‌లో ఇదే  రాజస్తాన్‌ రాయల్స్‌పై 58 పరుగులు సాధించడం విశేషం. తాజాగా ఇషాన్‌ కిషన్‌ రికార్డును తిలక్‌ బద్దలుకొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల​ నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది.  

ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి తిలక్‌ వర్మ తన ప్రదర్శనతో అభిమానుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. తెలుగు కుర్రాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ ముంబై  ఇండియన్స్‌ లాంటి బలమైన జట్టుకు ఆడడం అతని అదృష్టం అనే చెప్పాలి. సూర్యకుమార్‌ యాదవ్‌ లేని లోటును తిలక్‌ వర్మ తీరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 22 పరుగులు చేశాడు. రోహిత్‌ అతనిపై నమ్మకముంచి రెండో మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాడు. తాజాగా 61 పరుగుల ఇన్నింగ్స్‌తో ముంబై జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


Courtesy: IPL Twitter
ఇక తిలక్‌ వర్మను అభినందిస్తూ అభిమానులు కామెంట్‌ చేశారు. ''అదరగొట్టావు తెలుగు కుర్రాడా.. నీ ఆటకు ఫిదా.. సూర్య లేని లోటును తీరుస్తున్నావు.. ఇలాగే ముందుకు వెళ్లు.. త్వరలోనే టీమిండియాలో నిన్ను చూస్తాము.. నీ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అద్భుతం'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్‌-202 మెగా వేలంలో  తిలక్‌ వర్మను ముంబై ఇండియన్స్‌ రూ.కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ రంజీట్రోఫీలోను అదరగొట్టాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో తిలక్‌ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా

IPL 2022: సూర్యకుమార్‌ను ఎందుకు పక్కనబెట్టారు.. ?!

తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు