IPL 2022: యువరాజ్‌.. మెచ్చుకోవడం సరే; తిట్టింది ఎవరిని?

14 Apr, 2022 23:18 IST|Sakshi

టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చాలా రోజుల తర్వాత ట్విటర్‌లో దర్శనమిచ్చాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో జాస్‌ బట్లర్‌ ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు. అదే సమయంలో బట్లర్‌ను చూసి నేర్చుకోవాలని రాజస్తాన్‌ జట్టులోని ఒక సీనియర్‌ ఆటగాడికి హితోపదేశం చేశాడు. ప్రస్తుతం యువీ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలే జరిగిందంటే..  గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ జిమ్మీ నీషమ్‌ వేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని హార్దిక్‌ పాండ్యా లాంగాన్‌ దిశగా ఆడాడు. అయితే బట్లర్‌ వేగంగా పరిగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. నాలుగు పరుగులు సేవ్‌ చేశాడని భావించేలోపే బట్లర్‌ తన చేత్తో ఫోర్‌ సిగ్నల్‌ ఇచ్చి అంపైర్‌ను క్రాస్‌ చెక్‌ చేయాలని కోరాడు. అంపైర్‌ పరిశీలనలో బట్లర్‌ బంతిని అందుకున్నప్పటికి.. తన కాలు బౌండరీ రోప్‌కు  తగిలినట్లు అప్పర్‌ యాంగిల్‌లో కనిపించింది. దీంతో అంపైర్‌ ఫోర్‌గా ప్రకటించాడు.

ఇది జరిగిన కాసేపటికే యువీ తన ట్విటర్‌ వేదికగా బట్లర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ''క్రికెట్‌ గేమ్‌లో మనకింకా జెంటిల్‌మెన్‌ మిగిలే ఉన్నాడు. బట్లర్‌ ప్రదర్శించిన క్రీడాస్పూర్తి నాకు నచ్చింది. బట్లర్‌ను చూసి మిగతావాళ్లు నేర్చుకోవాలి.. ముఖ్యంగా అదే జట్టులోని ఒక సీనియర్‌ ఆటగాడు కూడా'' అంటూ పేర్కొన్నాడు. మిగతావాళ్లు కూడా బట్లర్‌ను పొగిడినప్పటికి.. యువరాజ్‌ చెప్పిన ఆఖరి లైన్‌ ఎక్కువగా హైలైట్‌ అయింది.

మరి రాజస్తాన్‌ రాయల్స్‌లో ఆ సీనియర్‌ ఆటగాడు ఎవరు.? ఫ్యాన్స్‌ మాత్రం అది కచ్చితంగా అశ్విన్‌ అని సమాధానం ఇచ్చారు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా అశ్విన్‌ ఉన్నప్పుడు యువరాజ్‌ అదే జట్టుకు ఆడాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. అది మనసులో పెట్టుకొనే యువరాజ్‌ అశ్విన్‌కు పరోక్షంగా చురకలు అంటించాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఏది ఏమైనా మెచ్చుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికి.. యువరాజ్‌ ఎవరిని తిట్టాడనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో దీనికి సమాధానం దొరుకుతుందేమో చూడాలి. 

చదవండి: IPL 2022: పాండ్యా చేయి పడితే అంతే.. వికెట్‌ అయినా విరిగిపోవాల్సిందే

Vijay Shankar: 'జట్టు మారినా ఆటతీరు మారలేదు.. తీసి పారేయండి!'

మరిన్ని వార్తలు