IPL 2022 Final: ఎవరు గెలిచినా చరిత్రే.. టాస్‌ ఓడితే మాత్రం అంతే సంగతులు! అయితే..

29 May, 2022 09:09 IST|Sakshi
రాజస్తాన్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు(PC: IPL.BCCI)

IPL 2022 Final GT Vs RR: ఐపీఎల్‌-2022 మెగా ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అరంగేట్రంలోనే అదరగొడుతూ వరుస విజయాలతో ఫైనల్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మొదటి విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీకి సిద్ధమయ్యాయి. తుది పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఆసక్తికర పోరు కోసం ఐపీఎల్‌ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇందులో ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే. మరి ఈ రసవత్తరమైన మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్‌ స్వభావం ఎలా ఉంటుంది? ఇరు జట్ల ప్రధాన బలం, తుది జట్ల అంచనా తదితర వివరాలు గమనిద్దాం.

మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ?
►ఆదివారం (మే 29)
►సమయం: రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం
►వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌

ముఖాముఖి రికార్డులు
ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండింటిలోనూ గుజరాత్‌ పైచేయి సాధించింది. లీగ్‌ దశలో నవీ ముంబైలోని డీవై పాటిల్‌ వేదికగా తొలిసారి రాజస్తాన్‌, గుజరాత్‌ తలపడ్డాయి. ఇందులో హార్దిక్‌ పాండ్యా సేన 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక క్వాలిఫైయర్‌-1లో డేవిడ్‌ మిల్లర్‌, హార్దిక్‌ పాండ్యా విజృంభణతో గుజరాత్‌ చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సగర్వంగా ఫైనల్‌ చేరింది.

పిచ్‌ వాతావరణం
అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువ. పగటివేళ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆర్ద్రత తక్కువ. కాగా  నరేంద్ర మోదీ స్టేడియంలోలో ఆరు ఎర్రమట్టి, 5 నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో పిచ్‌ తయారీకి ఉపయోగించిన మట్టిపైనే దాని స్వభావం ఆధారపడి ఉంటుంది. ఎర్రమట్టి పిచ్‌లు అయితే త్వరగా ఎండి.. స్పిన్నర్లకు అనుకూలంగా మారతాయి. 

ఇక అహ్మదాబాద్‌ వికెట్‌పై నమోదైన సగటు తొలి ఇన్నింగ్స్‌- 160 పరుగులు. ఇక్కడ లక్ష్య ఛేదనకు దిగిన జట్లే 55 శాతం గెలుపొందాయి. కాబట్టి టాస్‌ కీలకం కానుంది. క్వాలిఫైయర్‌-2లో భాగంగా రాజస్తాన్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ ఇందుకు నిదర్శనం.

ఇందులో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సంజూ శాంసన్‌ బృందం గెలుపొందిన విషయం తెలిసిందే. కాబట్టి ఫైనల్లోనూ టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. సొంత మైదానంలో ఆడటం గుజరాత్‌కు కలిసి వచ్చే అంశం. గత మ్యాచ్‌లో గెలుపొందడం రాజస్తాన్‌కు సానుకూలాంశం.

తుది జట్ల వివరాలు (అంచనా)  
గుజరాత్‌: శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), మాథ్యూ వేడ్‌, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, అల్జరీ జోసెఫ్‌, ఆర్‌ సాయి కిషోర్‌, మహ్మద్‌ షమీ, యశ్‌ దయాళ్‌

రాజస్తాన్‌: జోస్‌ బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్‌ కృష్ణ, ఒబెడ్‌ మెకాయ్‌, యజువేంద్ర చహల్‌

సమిష్టి కృషితో
పెద్దగా అంచనాలు లేని గుజరాత్‌ టైటాన్స్‌.. సమష్టి కృషితో వరుస విజయాలు సాధించింది. ఒక్కరిపైనే భారం వేయకుండా.. జట్టుగా ముందుకు సాగింది. లీగ్‌ దశలో ఆడిన 9 మ్యాచ్‌లలో ఆ జట్టుకు చెందిన 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకోవడం ఇందుకు నిదర్శనం.

ఓపెనర్లు గిల్‌, సాహా రాణించడం.. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా ఉండటం గుజరాత్‌కు పెద్ద బలం. ఇక క్వాలిఫైయర్‌-1లో డేవిడ్‌ మిల్లర్‌ చెలరేగిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలర్లలో  రషీద్‌ ఖాన్‌, షమీ ప్రధాన బలం.

హిట్టర్‌ ఉండగా చింత ఏల?
రాజస్తాన్‌ను ఒంటి చేత్తో  గెలిపించగల సత్తా, సామర్థ్యం జోస్‌ బట్లర్, సంజూ శాంసన్‌ సొంతం. సాంమ్సన్‌ కొన్నిసార్లు నిరాశపరిచినా.. ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ప్రత్యర్థి బౌలర్‌కు కష్టమే. ఇక బౌలింగ్‌ విభాగంలో చహల్‌, బౌల్ట్‌తో పాటు ఆర్సీబీతో మ్యాచ్‌లో సత్తా చాటిన ప్రసిద్‌, మెకాయ్‌ ఉండనే ఉన్నారు.

చదవండి 👇
IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేత, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్‌.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'

Poll
Loading...
మరిన్ని వార్తలు