Glenn Maxwell: రనౌట్‌ ఎఫెక్ట్‌! నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను కోహ్లి.. నేను నీలా కాదు!

5 May, 2022 12:44 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌(PC: IPL/BCCi)

IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయంతో రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్సీబీ) బెంగళూరు శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందడంతో డ్రెస్సింగ్‌ రూంలో సందడి నెలకొంది. ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఓపెనర్‌ విరాట్‌ కోహ్లిని ఆటపట్టించాడు.

రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు. ఒకటి, రెండు పరుగులు సాధిస్తావు... కానీ నేను అలా కాదు’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, కోహ్లి మాత్రం తనకేమీ పట్టనట్లు.. ‘ఏంట్రా బాబూ ఇది’’ అన్నట్లు ముఖం పెట్టి బ్యాట్‌ సర్దిపెట్టుకున్నాడు. 

కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సింగిల్‌కు పెద్దగా అవకాశం లేనప్పటికీ కోహ్లి పరుగుకు యత్నించాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న మాక్సీ.. కోహ్లికి బదులిచ్చే క్రమంలో క్రీజును వీడాడు. అయితే, అప్పటికే బంతిని అందుకున్న రాబిన్‌ ఊతప్ప.. వికెట్‌ కీపర్‌ ధోనికి త్రో వేశాడు.

దీంతో వెంటనే ధోని వికెట్లను గిరాటేయడంతో మాక్సీ(3) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉండగా కోహ్లి ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి విజయంలో తన వంతు ప్రాత పోషించాడు. ఈ నేపథ్యంలో మాక్సీ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 49: ఆర్సీబీ వర్సెస్‌ చెన్నై స్కోర్లు
ఆర్సీబీ-173/8 (20)
చెన్నై-160/8 (20)

చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’

మరిన్ని వార్తలు