Riyan Parag- R Ashwin: అశ్విన్‌పై రియాన్‌ పరాగ్‌ గుస్సా.. ఏంటిది? వీడియో వైరల్‌

25 May, 2022 12:43 IST|Sakshi
రియాన్‌ పరాగ్‌, అశ్విన్‌ (PC: IPL/BCCI)

IPL 2022 GT Vs RR: ఐపీఎల్‌-2022 ఫైనల్‌ చేరాలంటే గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో రాజస్తాన​ రాయల్స్‌కు పరాభవమే ఎదురైంది. మంచి స్కోరు నమోదు చేసినప్పటికీ గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(27 బంతుల్లో 40 పరుగులు), డేవిడ్‌ మిల్లర్‌(38 బంతుల్లో 68 పరుగులు) విజృంభణతో ఓటమిపాలైంది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా నిలిచి గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ 3 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. జోస్‌ బట్లర్‌(89 పరుగులు), కెప్టెన్‌ సంజూ శాంసన్‌(47 పరుగులు), పడిక్కల్‌(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

ఇదిలా ఉంటే.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సీనియర్‌ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పట్ల వ్యవహరించిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో అశ్విన్‌ క్రీజులో ఉండగా యశ్‌ దయాల్‌ బంతిని సంధించాడు. ఇది వైడ్‌గా వెళ్లింది. 

ఈ క్రమంలో అశ్విన్‌తో సమన్వయం చేసుకోకుండానే పరుగుకు యత్నించిన రియాన్‌ పరాగ్‌ రనౌట్‌ అయ్యాడు. అంతేగాక అశ్విన్‌వైపు సీరియస్‌గా చూస్తూ రన్‌ ఎందుకు తీయలేదు అన్నట్లు లుక్కు ఇచ్చాడు. అశూ మాత్రం క్రీజులో అలాగే ఉండిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీనియర్‌ పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని నెటిజన్లు రియాన్‌ పరాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల తన విచిత్రమైన సెలబ్రేషన్స్‌తో పరాగ్‌ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్లో ప్రవేశించింది.

ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు
👉🏾టాస్‌- గుజరాత్‌
👉🏾రాజస్తాన్‌ రాయల్స్‌- 188/6 (20)
👉🏾గుజరాత్‌ టైటాన్స్‌- 191/3 (19.3)
👉🏾7 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం
👉🏾ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ మిల్లర్‌(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్‌)

చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!
చదవండి👉🏾LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా? నిలిచేది ఎవరు?

మరిన్ని వార్తలు