MS Dhoni: అప్పుడప్పుడు కొన్ని షాట్లతో చప్పట్లు కొట్టించుకోవడం మినహా ఏమీ లేదు.. అయినా తలైవా అన్నీ తానై!

25 Mar, 2022 10:21 IST|Sakshi

సూపర్‌ కింగ్స్‌ కర్త, కర్మ, క్రియ

సరిలేరు ధోనీకెవ్వరు!

‘చెన్నై జట్టు పది మందితోనే ఆడుతోంది. ధోని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గానే జట్టులో ఉన్నాడు’...గత ఐపీఎల్‌ సీజన్‌లో వ్యాఖ్యాతలు, విశ్లేషకులనుంచి పదే పదే వినిపించిన వ్యాఖ్య ఇది. 11 ఇన్నింగ్స్‌లలో 107 బంతులు ఆడితే చేసినవి 114 పరుగులు మాత్రమే. అత్యధిక స్కోరు 18!

2020 ఐపీఎల్‌ కూడా దాదాపు ఇలాగే సాగింది. 12 ఇన్నింగ్స్‌లలో 172 బంతుల్లో అతను 200 పరుగులు చేశాడు. 106, 116 స్ట్రైక్‌ రేట్‌లు అనేవి ధోని స్థాయి ఆటగాడినుంచి ఊహించనివి! అతని బ్యాటింగ్‌లో మునుపటి దూకుడు లేదు.

నాటి మెరుపులూ, చమక్కులూ కనిపించడం లేదు. ఆటలో అంతా ముగిసిపోయిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని షాట్లతో చప్పట్లు కొట్టించుకోవడం మినహా ఒక ప్రధాన బ్యాటర్‌గా అతను ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనేది వాస్తవం. అయినా సరే ధోని ఐపీఎల్‌లో కొనసాగాడు. 2019 వరల్డ్‌ కప్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన తర్వాత రెండేళ్ల పాటు అతను లీగ్‌లో నిలిచాడంటే అతని నాయకత్వ లక్షణాలే కారణం.

అదే శ్రీరామరక్ష
కెప్టెన్సీ అర్హతతోనే అతను జట్టులో భాగంగా ఉన్నాడు. ధోని బ్రాండ్‌ అనేదే సీఎస్‌కేకు ఇన్నేళ్లుగా శ్రీరామరక్షలా ఉంది. అందుకే ధోని బ్యాటింగ్‌తో సంబంధం లేకుండా అతని చుట్టూ జట్టును టీమ్‌ యాజమాన్యం నిర్మించుకుంటూ వచ్చింది. సీనియర్‌ అయినా, జూనియర్‌ అయినా ఆటగాళ్లను కలిపి ఉంచే ఒక దారంలా ధోని కొనసాగాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న ధోని నాయకత్వ ప్రతిభ, అతని అనూహ్య నిర్ణయాలు, అసాధారణ వ్యూహాలు ఐపీఎల్‌లో చెన్నైని గొప్ప జట్టుగా నిలిపాయి.

అందుకే బ్యాటింగ్‌ భారం ఇతర ఆటగాళ్లు చూసుకుంటారు... మైదానంలో కెప్టెన్‌గా అతనుంటే చాలని చెన్నై యాజమాన్యం భావించింది. నిజంగా కూడా ఆ నమ్మకాన్ని ధోని నిలబెట్టాడు. 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన అనంతరం ఇదే ఆఖరి సీజనా అన్నట్లుగా అడిగిన ప్రశ్నకు ‘డెఫినెట్‌లీ నాట్‌’ అంటూ సమాధానమిచ్చిన ధోని తర్వాత ఏడాది నిజంగానే ఘనంగా తిరిగొచ్చాడు.

విమర్శకుల నోళ్లు మూయించాడు..
‘సీనియర్‌ సిటిజన్స్‌ టీమ్‌’ అంటూ వచ్చిన విమర్శలకు గట్టిగా జవాబిచ్చేలా ఆ ఆటగాళ్లతోనే చెన్నైను చాంపియన్‌గా నిలపడం విశేషం. అయితే ఈ సారి అతని ఆలోచనలు భిన్నంగా ఉండి ఉండవచ్చు. నిజానికి గత సీజన్ల తరహాలోనే ఆలోచిస్తే ధోని కెప్టెన్సీనుంచి తప్పుకునేందుకు బలమైన కారణం ఏమీ కనిపించదు కానీ... అతని నిర్ణయాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ధోని అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని అనిపిస్తోంది.

ఇప్పుడే కాదు వచ్చే సీజన్‌ కూడా ఆడతాడంటూ సీఎస్‌కే సీఈఓ చెబుతున్నా...అది సాధ్యమయ్యేలా అనిపించడం లేదు. అతని ఫిట్‌నెస్‌ తదితర అంశాలు కూడా ధోనికి సహకరించకపోవచ్చు. అందుకే జడేజాకు తగిన ‘గైడెన్స్‌’ ఇస్తూ భవిష్యత్తు కోసం టీమ్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం మొదలైనట్లే. ప్లేయర్‌గా కాకుండా ‘మెంటార్‌’ పాత్రలోకి చేరేందుకు ఇది మొదటి అడుగు కావచ్చు. చెన్నై టీమ్‌పై కెప్టెన్‌గా ధోని వేసిన ముద్ర ఎప్పటికీ చెరపలేనిది. కెప్టెన్‌ హోదాలో మ్యాచ్‌ ముగిశాక అతను విసిరే ‘పంచ్‌ డైలాగ్‌’లు కూడా ఇకపై వినిపించవు! 
-(సాక్షి క్రీడా విభాగం)  

చదవండఙ: T10 League: నరాలు తెగే ఉత్కంఠ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు

మరిన్ని వార్తలు