KKR VS SRH: కేన్‌ మామ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా..!

16 Apr, 2022 12:15 IST|Sakshi
Photo Courtesy: IPL

Kane Williamson: ఐపీఎల్‌ 2022 సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ ఆ తరువాత హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతుంది. నిన్న (ఏప్రిల్‌ 15) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆరెంజ్‌ ఆర్మీ ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని జట్టుగా రాటుదేలుతుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచి బౌలింగ్‌లో బలంగానే ఉన్న విలియమ్సన్‌ సేన.. గత మూడు మ్యాచ్‌లుగా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతూ వరుస విజయాలు సాధిస్తుంది. 


సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించి ఎస్‌ఆర్‌హెచ్‌కు సీజన్‌ తొలి విజయాన్ని అందించగా, గుజరాత్‌పై కెప్టెన్‌ విలియమ్సన్‌ (46 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫిఫ్టి బాది జట్టును గెలిపించాడు. తాజాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి (37 బంతుల్లో 71; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), మార్క్రమ్‌ (36 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఎస్‌ఆర్‌హెచ్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ టాప్‌ ఆర్డర్‌లో ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు రాణిస్తుండటంతో ఆ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, టైటిల్‌ వేటలో మేము కూడా ఉన్నామంటూ సంకేతాలు పంపుతుంది.


ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ స్కిప్పర్‌ విలియ‌మ్సన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన విలియమ్సన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున 2000 ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కేన్‌ మామ (2009) కంటే ముందు డేవిడ్ వార్న‌ర్ (4014), శిఖ‌ర్ ధవ‌న్ (2518) స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌ఫున 2000 పరుగుల మార్కును దాటారు. కాగా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన విలియమ్సన్‌ సేన.. ప్రత్యర్ధిని 175 పరుగులకు కట్టడి చేయగలిగింది. ఛేదనలో త్రిపాఠి, మార్క్రమ్‌ రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ మరో 13 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. 
చదవండి: 'కేకేఆర్‌పై ఇటువంటి ఇన్నింగ్స్‌ ఆడడం సంతోషంగా ఉంది'

>
మరిన్ని వార్తలు