KKR Vs MI: అస్సలు ఊహించలేదు.. జీర్ణించుకోవడం కష్టమే.. కానీ: రోహిత్‌ శర్మ

7 Apr, 2022 11:21 IST|Sakshi
రోహిత్‌ శర్మ(PC: IPL/Disney+hotstar)

‘Awaaz badhao yaar’ – Says Frustrated Rohit Sharma: ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ మినహా మిడిలార్డర్‌ విఫలం కావడంతో విజయం తమదే అన్న ధీమాతో ఉన్న ముంబై ఆశలపై ప్యాట్‌ కమిన్స్‌ నీళ్లు చల్లాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 15 బంతుల్లోనే ఏకంగా 56 పరుగులు సాధించాడు.

తద్వారా కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్‌ డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడి ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకుని ముంబైకి చేదు అనుభవం మిగిల్చాడు. ఈ క్రమంలో ఓటమి అనంతరం ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. తమ ప్రణాళికలు మైదానంలో అమలు చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు.

అదే సమయంలో ప్యాట్‌ కమిన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌ ఇంత బాగా బ్యాటింగ్‌ చేస్తాడని అస్సలు ఊహించలేదు. కేకేఆర్‌ విజయానికి సంబంధించిన క్రెడిట్‌ మొత్తం అతడికే చెందుతుంది. 15వ ఓవర్‌ వరకు గేమ్‌ మా చేతిలోనే ఉంది. కానీ కమిన్స్‌ అద్బుతం చేశాడు’’ అని కొనియాడాడు.

ఇక ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనన్న రోహిత్‌ శర్మ.. తాము మున్ముందు చేయాల్సింది చాలా ఉందన్నాడు. ‘‘నిజానికి మాకు శుభారంభం లభించలేదు. బౌలింగ్‌లో కూడా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం’’ అని తెలిపాడు. ప్రతిసారి ఇలాంటి స్థానం(ఓడిపోయిన కెప్టెన్‌)లో ఉండాలనుకోవడం లేదంటూ విసుగుతో కూడిన చిరునవ్వుతో తన మనసులోని భావాలను బయటపెట్టాడు.

కాగా అంతకుముందు మాట్లాడటానికి వచ్చే సమయంలో.. డ్యానీ మోరిసన్‌ ప్రశ్న వినపడకపోవడంతో.. చిరాకు పడిన రోహిత్‌ .. ‘‘కాస్త సౌండ్‌ పెంచండి’’ అంటూ విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: KKR vs MI: డేనియల్‌ సామ్స్‌ చెత్త రికార్డు.. రోహిత్‌కు ఆ అవకాశం ఇస్తే కదా!

మరిన్ని వార్తలు