IPL 2022: సన్‌రైజర్స్‌ ఢమాల్‌

15 May, 2022 05:16 IST|Sakshi
రసెల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ క్లీన్‌ బౌల్డ్‌

కీలక మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి 

54 పరుగులతో నైట్‌రైడర్స్‌ విజయం

రసెల్‌ ఆల్‌రౌండ్‌ షో

పుణే: సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్‌ దారి సులువే అనుకుంటున్న తరుణంలో మళ్లీ పరాజయాల బాట...విజయాలలాగే వరుసగా ఐదో ఓటమితో అవకాశాలు సంక్లిష్టం! ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి ఇది. శనివారం జరిగిన కీలక పోరులో హైదరాబాద్‌ 54 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడింది.

తొలుత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రీ రసెల్‌ (28 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. తర్వాత సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (25 బంతుల్లో 32; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.  

రసెల్‌ మెరుపులు...
ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (7) త్వరగానే అవుటైనా... నితీశ్‌ రాణా (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 28; 3 సిక్సర్లు) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 55/1 స్కోరు చేసింది. అయితే తన తొలి ఓవర్లోనే నితీశ్, రహానేలను పెవిలియన్‌ చేర్చిన ఉమ్రాన్‌ తన తర్వాతి ఓవర్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (15)ను అవుట్‌ చేశాడు.

రింకూ సింగ్‌ (5) ఎల్బీగా నిష్క్రమించగా,  బిల్లింగ్స్‌ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆటలో దూకుడు కనిపించలేదు. 19వ ఓవర్లో చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్‌ 6 పరుగులే ఇచ్చినా... వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన చివరి ఓవర్లో రసెల్‌ రెచ్చిపోయాడు. అతను 3 సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.

పేలవ బ్యాటింగ్‌...
ముందంజ వేసే అవకాశాలు మెరుగుపడాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమైంది. అభిషేక్, మార్క్‌రమ్‌ మినహా అంతా విఫలమయ్యారు. చెత్త షాట్లతో రైజర్స్‌ ఆశల్ని ముంచేశారు. విలియమ్సన్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (9)లతో పాటు మిడిలార్డర్‌లో పూరన్‌ (2), సుందర్‌ (4), శశాంక్‌ సింగ్‌ (11) ప్రభావం చూపలేకపోయారు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ (బి) జాన్సెన్‌ 7; రహానె (సి) శశాంక్‌ (బి) ఉమ్రాన్‌ 28; నితీశ్‌ (సి) శశాంక్‌ (బి) ఉమ్రాన్‌ 26; శ్రేయస్‌ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్‌ 15; బిల్లింగ్స్‌ (సి) విలియమ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 34; రింకూ సింగ్‌ (ఎల్బీ) (బి) నటరాజన్‌ 5; రసెల్‌ నాటౌట్‌ 49; నరైన్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–17, 2–65, 3–72, 4–83, 5–94, 6–157.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–27–1, జాన్సెన్‌ 4–0–30–1, నటరాజన్‌ 4–0–43–1, సుందర్‌ 4–0–40–0, ఉమ్రాన్‌ మలిక్‌ 4–0–33–3.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) వరుణ్‌ 43; విలియమ్సన్‌ (బి) రసెల్‌ 9; త్రిపాఠి (సి) అండ్‌ (బి) సౌతీ 9; మార్క్‌రమ్‌ (బి) ఉమేశ్‌ 32; పూరన్‌ (సి) అండ్‌ (బి) నరైన్‌ 2; సుందర్‌ (సి) వెంకటేశ్‌ (బి) రసెల్‌ 4; శశాంక్‌ (సి) శ్రేయస్‌ (బి) సౌతీ 11; జాన్సెన్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) రసెల్‌ 1; భువనేశ్వర్‌ నాటౌట్‌ 6; ఉమ్రాన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 123.
వికెట్ల పతనం: 1–30, 2–54, 3–72, 4–76, 5–99, 6–107, 7–113, 8–113.
బౌలింగ్‌: ఉమేశ్‌ 4–0–19–1, సౌతీ 4–0–23–2, నరైన్‌ 4–0–34–1, రసెల్‌ 4–0–22–3, వరుణ్‌ 4–0–25–1.

ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ X గుజరాత్‌ టైటాన్స్‌
లక్నో సూపర్‌ జెయింట్స్‌ X రాజస్తాన్‌ రాయల్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు