CSK VS PBKS: పంజాబ్‌తో సమరం.. ధోనిని ఊరిస్తున్న సిక్సర్ల రికార్డు

3 Apr, 2022 18:11 IST|Sakshi

MS Dhoni: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) కింగ్స్‌ ఫైట్‌ జరుగనుంది. ముంబైలోని బ్ర‌బోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభమయే ఈ సమరంలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై రగిలిపోతున్న సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా, పంజాబ్‌.. సీజన్‌లో రెండో విజయం కోసం ఆరాటపడుతుంది. 

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎంఎస్‌డీ మరో 3 సిక్సర్లు బాదితే చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున అత్య‌ధిక సిక్సర్‌లు కొట్టిన ఆట‌గాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ధోని ఖాతాలో 217 సిక్సర్లు ఉండగా.. సీఎస్‌కే త‌ర‌ఫున అత్య‌ధిక సిక్సర్ల రికార్డు సురేష్ రైనా (219 సిక్సర్లు) పేరిట నమోదై ఉంది. 

ఐపీఎల్‌లో ఓ జ‌ట్టు త‌ర‌ఫున అత్య‌ధిక సిక్సర్ల రికార్డు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్‌.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున 263 సిక్సర్లు బాది ఐపీఎల్‌లో ఓ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ (249 సిక్సర్లు) రెండో స్థానంలో, ఆర్సీబీ మాజీ ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ (240) మూడో ప్లేస్‌లో, ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి (226) నాలుగో స్థానంలో, సీఎస్‌కే మాజీ ఆటగాడు సురేష్ రైనా (219) ఐదో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ధోని (217) మరో 3 సిక్సర్లు బాదితే  రైనాను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకుతాడు.
చదవండి: IPL 2022: పంజాబ్‌తో మ్యాచ్‌.. బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్న చెన్నై
 

మరిన్ని వార్తలు