IPL 2022: ముంబైపై ఢిల్లీ గెలిచిందా.. ఆ నాలుగు జట్లు ఇంటికే..!

17 May, 2022 13:43 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 ప్లే ఆఫ్స్‌ సమీకరణలు రసవత్తరంగా మారాయి. నిన్న (మే 16) పంజాబ్‌ను ఢిల్లీ మట్టికరిపించడంతో సమీకరణలు మారిపోయాయి. 20 పాయింట్లు కలిగిన గుజరాత్‌ ప్లే​ ఆఫ్స్‌ బెర్తు కన్ఫర్మ్‌ చేసుకున్న ఏకైక జట్టు కాగా.. టెక్నికల్‌గా రాజస్థాన్‌ (16), లక్నో (16), ఢిల్లీ (14), ఆర్సీబీ (14), కేకేఆర్‌ (12), పంజాబ్‌ (12), సన్‌రైజర్స్‌ (10) జట్లు ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ జట్లన్నీ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్‌ ఒక్కటే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

వీటిలో రాజస్థాన్‌ (0.304), లక్నో (0.262) జట్లు మెరుగైన రన్‌రేట్‌తో పాటు 16 పాయింట్లు కలిగి సేఫ్‌ సైడ్‌లో ఉండగా.. మిగతా ఐదు జట్ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. ఈ ఐదు జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆర్సీబీతో సమానంగా 14 పాయింట్లు కలిగిన ఢిల్లీకే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ (-0.323)తో పోలిస్తే ఢిల్లీ (0.255) రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. 

- ఇవాళ (మే 17) ముంబై చేతిలో ఓడితే సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ముంబైపై సన్‌రైజర్స్‌ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

- మే18న లక్నోపై కేకేఆర్‌ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఒక వేళ ఓడిందా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 

- మే 19న గుజరాత్‌పై ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తేనే రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవడంతో పాటు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. 

- మే 20న సీఎస్‌కేపై రాజస్థాన్‌ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రాజస్థాన్‌ ఓ మోస్తరు తేడాతో ఓడినా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా సేఫ్‌ సైడ్‌లోనే ఉంటుంది. 

- మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే.. మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్సీబీని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ దెబ్బతో ఆర్సీబీ సహా కేకేఆర్‌, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ జట్లు ఇంటికి చేరతాయి. ఒక వేళ ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 

- ఒకవేళ ముంబైపై సన్‌రైజర్స్‌ గెలిచి, లక్నోపై కేకేఆర్‌ గెలిచి, గుజరాత్‌ చేతిలో ఆర్సీబీ ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే మాత్రం మే 22న జరిగే సన్‌రైజర్స్‌- పంజాబ్‌ మ్యాచ్‌ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిస్తే ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్‌లతో సమానంగా (14 పాయింట్లు)  నిలుస్తుంది. సన్‌రైజర్స్‌ నిష్క్రమిస్తుంది.

- ఆఖరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా 16 పాయింట్లతో రాజస్థాన్‌, లక్నోలు దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే.. ఢిల్లీ, పంజాబ్‌, ఆర్సీబీ, కేకేఆర్‌ జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తును దక్కించుకుంటుంది. 
చదవండి: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇరు జట్లలో భారీ మార్పులు..!

మరిన్ని వార్తలు