IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

25 Apr, 2022 14:09 IST|Sakshi
Photo Courtesy: IPL

PBKS VS CSK Head To Head Records: ఐపీఎల్‌ 2022 సీజన్‌ రెండో అర్ధ భాగం మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 25) కింగ్స్‌ ఫైట్‌ జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇంచుమించు ఇదే పరిస్థితి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 8వ స్థానం) ఉన్న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. 

సీజన్‌ తొలి భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌దే పైచేయి (54 పరుగుల తేడాతో విజయం) కాగా, నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎస్‌కే భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు చాలా అసవరం. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఉంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ప్లే ఆఫ్స్‌ ఆశలు దాదాపుగా గల్లంతవుతాయి.

గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు 27 సందర్భాల్లో ఎదురెదురుపడగా  సీఎస్‌కే 16, పంజాబ్‌ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సీజన్‌ తొలి అర్ధ భాగంలో జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు, 2/25), రాహుల్‌ చాహర్‌ మాయాజాలం (3/25), వైభవ్‌ అరోరా కట్టుదిట్టమైన బౌలింగ్‌ (2/21) కారణంగా పంజాబ్‌ ఘన విజయం సాధించింది. చెన్నై జట్టులో శివమ్‌ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. 

తుది జట్లు (అంచనా) 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మిచెల్ శాంట్నర్, శివం దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (కెప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి. 

పంజాబ్ కింగ్స్‌: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా
చదవండి: IPL 2022: పాపం పొలార్డ్‌.. కృనాల్‌ ఓవరాక్షన్‌ భరించలేకున్నాం!


 

మరిన్ని వార్తలు