IPL 2022 RCB Vs RR: రియాన్‌ పరాగ్‌ వన్‌మ్యాన్‌ షో.. రాజస్తాన్‌ ‘రాయల్‌’గా గెలిచింది

27 Apr, 2022 07:31 IST|Sakshi
Courtesy: IPL Twitter

పుణే: బ్యాటింగ్‌ బలంతో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి బౌలింగ్‌లో సత్తా చాటింది. టాప్‌ బ్యాటర్లంతా విఫలమై తక్కువ స్కోరుకే పరిమితమైనా... బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో దానిని నిలబెట్టుకోగలిగింది. మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్‌ 29 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌)దే అత్యధిక స్కోరు. కుల్దీప్‌ సేన్‌ (4/20) రాణించగా, అశ్విన్‌ 3 వికెట్లు, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు.  

బట్లర్‌ విఫలం... 
సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సిక్స్‌ కొట్టిన పడిక్కల్‌ (7) అదే ఓవర్లో వెనుదిరగ్గా... అనూహ్యంగా అశ్విన్‌ (9 బంతుల్లో 17; 4 ఫోర్లు) మూడో స్థానంలో బరిలోకి దిగాడు. సిరాజ్‌ బౌలింగ్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన అశ్విన్‌ అతని బౌలింగ్‌లోనే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అయితే రాజస్తాన్‌కు అసలు షాక్‌ తర్వాతి ఓవర్లో తగిలింది. అత్యద్భుత ఫామ్‌తో జట్టును నడిపిస్తున్న జోస్‌ బట్లర్‌ (8) ఈసారి విఫలమయ్యాడు. ఈ దశలో కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నాడు. హసరంగ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను షహబాజ్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అయితే చివరకు హసరంగ బౌలింగ్‌లోనే అతను క్లీన్‌బౌల్డ్‌ కాగా, డరైల్‌ మిచెల్‌ (16), హెట్‌మైర్‌ (3) ప్రభావం చూపలేకపోయారు.

ఒక దశలో 44 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో పరాగ్‌ ఆట రాజస్తాన్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్‌ తరఫున 37 మ్యాచ్‌లు ఆడినా... 387 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన పరాగ్‌ ఎట్టకేలకు చక్కటి షాట్లతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 32 పరుగుల వద్ద హసరంగ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్‌ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో పరాగ్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌తో మొత్తం 18 పరుగులు రాబట్టాడు.  

సమష్టి వైఫల్యం... 
ఛేదనలో ఏ దశలోనూ బెంగళూరు పోటీలో ఉన్నట్లుగా కనిపించలేదు. గత మ్యాచ్‌ బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఇక్కడా కొనసాగిస్తూ ఒక్క బ్యాటర్‌ దూకుడుగా ఆడలేకపోగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ నమోదు కాలేదు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లి (9) మళ్లీ పేలవ షాట్‌తో వెనుదిరగ్గా, కుల్దీప్‌ సేన్‌ వరుస బంతుల్లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ (0)లను అవుట్‌ చేసి పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలో పటిదార్‌ (16), సుయాశ్‌ (2) ఆట ముగిసింది. అయితే విజయం కోసం 50 బంతుల్లో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (6) అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్‌ కావడంతో ఆర్‌సీబీ గెలుపు ఆశలు కోల్పోయింది. బ్యాటింగ్‌లో రాణించిన పరాగ్‌ 4 క్యాచ్‌లు కూడా అందుకోవడం విశేషం.  

Poll
Loading...
మరిన్ని వార్తలు