IPL 2022: ముంబై మళ్లీ ఓడింది! ఆర్సీబీ హ్యాట్రిక్‌ కొట్టింది!

10 Apr, 2022 07:23 IST|Sakshi
ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్సీబీ ప్లేయర్లు అనూజ్‌, కోహ్లి( PC: IPL/BCCI)

బెంగళూరు జైత్రయాత్ర

IPL 2022 RCB Vs MI- పుణే: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఓటమి తర్వాత కోలుకున్న బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) వరుసగా మూడో విజయాన్ని అందుకోగా... ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 7 వికెట్లతో ముంబైని ఓడించింది. ముందుగా ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 68 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అనూజ్‌ రావత్‌ (47 బంతుల్లో 66; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (36 బంతుల్లో 48; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 80 పరుగులు (52 బంతుల్లో) జోడించి జట్టు విజయాన్ని సునాయాసంగా మార్చారు. 

38 బంతుల్లో 50 పరుగులు... ముంబై ఇండియన్స్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యమిది. రోహిత్‌ శర్మ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడగా, ఇషాన్‌ కిషన్‌ (26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాతే జట్టు బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. 50/0 నుంచి 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన జట్టు 62/5 వద్ద నిలిచింది. ఈ తరుణంలో సూర్యకుమార్‌ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు.

ముంబై ఈ మాత్రం స్కోరు చేయగలిగిందంటే అది అతని చలవే. ఛేదనలో బెంగళూరుకు రావత్, డుప్లెసిస్‌ శుభారంభం ఇచ్చారు. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో రావత్‌ మూడు సిక్సర్లు బాదాడు. డుప్లెసిస్‌ వెనుదిరిగిన తర్వాత కోహ్లి, రావత్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. విజయానికి చేరువైన దశలో రావత్‌తో పాటు కోహ్లి కూడా పెవిలియన్‌కు వెనుదిరిగినా... మ్యాక్స్‌వెల్‌ (8 నాటౌట్‌) పని పూర్తి చేశాడు. 

చదవండి: Glenn Maxwell: 'అక్కడ ఉంది ఎవరు?.. అట్లనే ఉంటది; పాపం తిలక్‌ వర్మ'

మరిన్ని వార్తలు