టిమ్‌ డేవిడ్‌పై ప్రేమను ఒలకబోస్తున్న ఆర్సీబీ.. వీ లవ్‌ యు అంటూ..!

22 May, 2022 16:02 IST|Sakshi
Photo Courtesy: RCB Twitter

సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ పుట్టి ముంచి, ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చిన ముంబై హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌పై ఆర్సీబీ ప్రేమను ఒలకబోస్తుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ నోటి కాడి విజయాన్ని లాగేసుకుని తమ చేతిలో పెట్టిన టిమ్‌పై ఆర్సీబీ ప్రశంసల వర్షం కురిపిస్తుంది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి సొంత జట్టును గెలిపించడంతో పాటు తమకు పరోక్షంగా సహకరించిన టిమ్‌కు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. 


‘‘మేం నిన్ను ప్రేమిస్తున్నాం టిమ్. నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు ఇలాగే రెచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అంటూ ఆర్సీబీ జెర్సీలో ఉన్న టిమ్ ఫొటోను తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఓవరాక్షన్‌ చేస్తుందని కొందరు.. ప్లే ఆఫ్స్‌ అవకాశం కోసం ఇంతలా దిగజారాలా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, టిమ్‌ డేవిడ్‌ గతేడాది ఆర్సీబీ జట్టులో ఉన్న విషయం చాలా మందికి తెలీదు. గత సీజన్‌లో అతను గాయపడిన ఫిన్‌ అలెన్‌ స్థానంలో ఆర్సీబీ చేరాడు. ఆ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ (సీఎస్‌కే) ఆడిన టిమ్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అలవోకగా సిక్సర్లు బాదగల సత్తా ఉన్న టిమ్‌ను ముంబై ఇండియన్స్‌ ఈ ఏడాది మెగా వేలంలో 8.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 

ఇదిలా ఉంటే, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో టిమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తును కన్ఫర్మ్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్‌ చేజారుతున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన టిమ్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్‌ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 
చదవండి: టిమ్‌ డేవిడ్‌కు గిఫ్ట్‌ పంపిన ఆర్సీబీ కెప్టెన్‌..!
 

మరిన్ని వార్తలు