IPL 2022: శివమ్‌ దూబే.. మరో యువరాజ్‌ దొరికేసినట్లే!

13 Apr, 2022 20:28 IST|Sakshi
Courtesy: IPL Twitter

శివమ్‌ దూబే.. ఐపీఎల్‌ 2022లో సంచలనం. సీఎస్‌కే తరపున ఆడుతున్న దూబే ఒక్క మ్యాచ్‌తో అభిమానులందరిని తనవైపు తిప్పుకున్నాడు. వాస్తవానికి దూబే ఈ సీజన్‌ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు కలిపి 207 పరుగులు చేసిన దూబే ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఆర్‌సీబీపై ఆడిన 96 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ దూబేను ఇవాళ ప్రత్యేకంగా నిలిపింది. అతని ఇన్నింగ్స్‌ చూసిన ఫ్యాన్స్‌.. మరో యువరాజ్‌ సింగ్‌ దొరికేశాడని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా గమనిస్తే.. దూబే కొట్టిన చాలా సిక్సర్లు డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ షాట్లను గుర్తుచేశాయి.

ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ చెప్పుకొచ్చాడు. ''ఆర్‌సీబీతో మ్యాచ్‌లో శివమ్‌ దూబే ఆడిన ఇన్నింగ్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అతను ఆడిన షాట్లు యువీని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. రెండు షాట్లు మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. హాజిల్‌వుడ్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని దూబే క్రీజులోనే ఉండి సిక్సర్‌ బాదాడు. ఇది మ్యాచ్‌కు హైలైట్‌ అని చెప్పొచ్చు. ఇలాంటి షాట్‌ చూసి చాన్నాళ్లయింది. గతంలో యువరాజ్‌ మాత్రమే ఇలాంటి షాట్స్‌ ఎక్కువగా ఆడేవాడు. ఆ తర్వాత వనిందు హసరంగా బౌలింగ్‌లో షార్ట్‌పిచ్‌ బంతిని బ్యాక్‌ఫుట్‌ తీసుకొని బౌండరీ తరలించాడు. ఈ రెండు షాట్లు చాలు.. అతను కేవలం హిట్టర్‌ మాత్రమే కాదు.. బాధ్యతతో ఆడగల బ్యాట్స్‌మన్‌ దాగున్నాడని చెప్పడానికి... ఇకపై దూబే ఇలాగే ఆడితే మాత్రం కచ్చితంగా మరో యువరాజ్‌ దొరికేసినట్లే'' అని చెప్పుకొచ్చాడు.

ఎవరీ శివమ్‌ దూబే..?
శివమ్‌ దూబే.. 1993 జూన్‌ 26న ముంబైలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. కానీ 14 ఏళ్ల వయసులో దూబే అనూహ్యంగా క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. అధిక బరువు, ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టకపోవడం.. ఆర్థిక సమస్యల కారణంగా క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరమయ్యాడు. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

ఆ తర్వాత అదే ఏడాది వెస్టిండీస్‌ సిరీస్‌ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో దూబే ఒక ఓవర్‌లో 34 పరుగులిచ్చి.. టి20 క్రికెట్‌ చరిత్రలో ఒక్క ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో​ బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఇక 29 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 606 పరుగులు సాధించాడు.

చదవండి: IPL 2022: రోహిత్‌ కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా..!

Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్‌​ దూబే

A post shared by @11g.ub

మరిన్ని వార్తలు