IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌ నిరసన గళం.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్‌ మామ 'వన్‌ స్టెప్‌ క్యాచ్‌' పంచాయతీ.. 

2 Apr, 2022 12:34 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసిరావడం లేదు. మెగా వేలం 2022లో ఆటగాళ్ల ఎంపిక దగ్గరి నుంచి తొలి మ్యాచ్‌లో తుది జట్టు కూర్పు వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకున్న ప్రతి నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ వివాదస్పద క్యాచ్‌ నిర్ణయం తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరంలో కలకలం రేపుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్‌ మామను ఔట్‌గా ప్రకటించిన తీరుపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బీసీసీఐ వద్ద పంచాయతీ పెట్టాలని డిసైడ్‌ చేసింది. 


ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసి, తమ అభ్యంతరాన్ని గట్టిగా తెలియజేసింది. వీడియో క్లిప్స్, వివిధ కోణాల్లో నుంచి తీసిన ఫొటోలను లేఖకు జత చేస్తూ.. తమ కెప్టెన్ ఔట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, బాధ్యుడైన అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. వీళైతే ఇలాంటి వివాదాస్పద క్యాచ్‌ల విషయంలో రూల్స్‌ను కూడా సవరించాలని కోరింది. 

కాగా, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ క్యాచ్‌ ఔటైనట్లు థర్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. అయితే ఫీల్డర్‌ (దేవ్‌దత్‌ పడిక్కల్‌) క్యాచ్‌ అందుకునే ముందు బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనబడుతున్నా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో వివాదానికి తెరలేసింది. వన్‌ స్టెప్‌ క్యాచ్‌లను కూడా ఔట్‌గా ప్రకటిస్తారా అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 
చదవండి: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్‌ 6 నుంచి..!

మరిన్ని వార్తలు