IPL 2022 LSG Vs RCB: అతడొక అద్భుతం.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

26 May, 2022 13:27 IST|Sakshi
లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌కు మంచి జట్లు దొరికాయి. ఈ రెండింటిలో పంజాబ్‌తో పోలిస్తే లక్నో మంచి ప్రదర్శన నమోదు చేసింది. సీజన్‌ ఆరంభంలోనే అదరగొట్టింది. చక్కగా ఆడింది. కానీ టాప్‌-2లో అడుగుపెట్టలేకపోయింది. ఇందుకు వారు పశ్చాత్తాపపడక తప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు.

కొత్త ఫ్రాంఛైజీ లక్నోను దురదృష్టం వెక్కిరించిందని టాప్‌-2లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నోకు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్‌లలో లక్నో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది.

అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ నేరుగా క్వాలిఫైయర్‌-1కు అర్హత సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ టైటిల్‌ రేసులో నిలిచే మరో అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడిన లక్నో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

టాస్‌ మొదలు.. ఫీల్డింగ్‌ తప్పిదాలు, బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిని మూటగట్టుకుని ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశాడు. ఇక పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి.. 14 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. 

పాటిదార్‌ అద్భుతం చేశాడు!
ఆర్సీబీని గెలిపించిన రజత్‌ పాటిదార్‌ను వసీం జాఫర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసించాడు. ‘‘సూపర్‌స్టార్ల మధ్య ఓ అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవడం చాలా కష్టం. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి రజత్‌ పాటిదార్‌ ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు’’ అని కొనియాడాడు. 

మరిన్ని వార్తలు