IPL 2024: రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక నిర్ణయం.. అతడిని వదిలేసి ఏకంగా రూ. 10 కోట్లతో..

22 Nov, 2023 18:40 IST|Sakshi
సంజూ శాంసన్‌తో దేవ్‌దత్‌- ఆవేశ్‌ ఖాన్‌ (PC: RR/LSG X)

IPL 2024- Avesh Khan: ఐపీఎల్‌-2024 వేలానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టాపార్డర్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను వదిలేసి.. అతడి స్థానంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది.

మరో ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో డైరెక్ట్‌ స్వాప్‌ పద్ధతిలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. లక్నోకు చెందిన ఆవేశ్‌ను తాము తీసుకుని.. బదులుగా పడిక్కల్‌ను ఆ ఫ్రాంఛైజీకి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

లక్నో 10 కోట్లకు కొంటే.. రాజస్తాన్‌ కూడా
కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి ఆవేశ్‌ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో లక్నో తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ పేసర్‌ 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు.

పడిక్కల్‌కు అంతమొత్తం ఇవ్వనున్న లక్నో
మరోవైపు.. గతంలో.. రాజస్తాన్‌ పడిక్కల్‌ను 7.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. ల​క్నో అంత మొత్తం అతడికి చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌.. 1521 పరుగులు చేశాడు.

ఈ లెఫ్టాండర్‌ ఖాతాలో ఇప్పటి వరకు ఓ శతకం, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్‌ తరఫున పడిక్కల్‌ 28 మ్యాచ్‌లు ఆడి 637 పరుగులు సాధించాడు. కాగా ఆవేశ్‌ ఖాన్‌ ప్రస్తుతం టీమిండియాతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో జట్టుకు ఎంపికైన అతడు.. నవంబరు 23న జరుగనున్న తొలి మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు.   

చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?

మరిన్ని వార్తలు