#Shubman Gill: అతడొక అద్భుతం.. మా విజయానికి కారణం అదే

25 Mar, 2024 11:13 IST|Sakshi
కెప్టెన్‌గా ఐపీఎల్‌లో శుబ్‌మన్‌ గిల్‌ తొలి విజయం(PC: BCCI/IPL)

Gujarat Titans won by 6 runs- Shubman Gill Comments: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కొత్త అధ్యాయం మొదలుపెట్టాడు. గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. అత్యధిక పరుగుల వీరుడి(890 రన్స్‌)గా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఇక తాజా సీజన్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ను గెలిపించి సత్తా చాటాడు. కాగా ఆదివారం సొంతమైదానం అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి లక్ష్యాన్ని కాపాడుకుంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేసి ఆరు పరుగుల తేడాతో విజయం అందుకుంది. సమిష్టి కృషితో ఐపీఎల్‌-2024లో శుభారంభం చేసింది. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సాయి సుదర్శన్‌(39 బంతుల్లో 45 రన్స్‌)పై ప్రశంసలు కురిపించాడు. జట్టు మెరుగైన స్కోరు చేయడంలో అతడిదే ముఖ్య భూమిక అని పేర్కొన్నాడు.

‘‘వికెట్‌ మీద మంచు ప్రభావం ఉన్నా మా వాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మా స్పిన్నర్లు సరైన సమయంలో వికెట్లు తీశారు. ఇక సాయి సుదర్శన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు.

అతడు అద్భుతంగా ఆడాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ వాళ్లు పొరపాట్లు చేసేలా మా వ్యూహాలు అమలు చేశాం. ఇక అహ్మదాబాద్‌ గ్రౌండ్‌లో ప్రేక్షకుల నుంచి మాకు లభించే మద్దతు గురించి ఏమని చెప్పగలం.

ప్రతి నిమిషం మాకు అండగా నిలుస్తూ.. స్టేడియాన్ని హోరెత్తిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో మేము మెరుగైన స్కోరే చేశాం. అయితే, ఆఖర్లో ఇంకో 15 పరుగులు జోడించి ఉంటే ఇంకాస్త బాగుండేది. కానీ.. చివర్లో వికెట్‌ స్లో అయింది. షార్ట్‌ బాల్స్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగానే అనిపించింది’’ అని శుబ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ ఫలితం గురించి విశ్లేషించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 22 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. ఇక గుజరాత్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ, స్పెన్సర్‌ జాన్సన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. సాయి కిషోర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. సమిష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పతనం చేశారు. 

చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

Election 2024

మరిన్ని వార్తలు