బుమ్రా, సూర్య ఉంటే ఏంటి? పాండ్యా తిరిగి వచ్చాడు కదా!.. ఏబీడీ కామెంట్స్‌

16 Dec, 2023 19:32 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌ జెర్సీలో హర్దిక్‌- రోహిత్‌ (PC: IPL)

AB de Villiers backs MI's decision: కెప్టెన్‌ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్‌ సరైన నిర్ణయం తీసుకుందని సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. కానీ హార్దిక్‌ పాండ్యా నియామకం విషయంలో ఎంఐ అభిమానుల నుంచి ఇంతటి నెగిటివిటీని ఊహించలేదన్నాడు. 

అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా ఫ్రాంఛైజీ పట్ల విశ్వాసంగా ఉన్న మాట వాస్తమేనన్న డివిలియర్స్‌.. ఇప్పుడు హార్దిక్‌ తిరిగి వచ్చినందు వల్ల అతడికి పగ్గాలు అప్పజెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. రోహిత్‌ శర్మను తప్పిస్తూ ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నాడు.

కాగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌-2024కు ముందు తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తనకు లైఫ్‌ ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కి మళ్లీ ఆడేందుకు సిద్ధమైన పాండ్యా ఈసారి కెప్టెన్‌గా అవతారమెత్తనున్నాడు. 

లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు
ఇదిలా ఉంటే.. ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడంతో ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లెజెండ్‌ పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా.. "RIP MUMBAI INDIANS" అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ ఇన్‌స్టా, ఎక్స్‌ పేజీల ఫాలోవర్లు లక్షల్లో తగ్గిపోయారు.

బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలనే?
ఈ విషయంపై తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించి ఏబీడీ.. ‘‘ఈ వార్త తెలిసిన తర్వాత కొంతమంది సంతోషపడితే.. మరికొంత మంది బాధపడుతున్నారు. అంతేకాదు కెప్టెన్‌ మార్పు ప్రకటన తర్వాత ఎంఐ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కోల్పోయిందని చదివాను.

రోహిత్‌ స్థానాన్ని హార్దిక్‌ భర్తీ చేయడాన్ని చాలా మంది పర్సనల్‌గా తీసుకుని ఉంటారు. అయితే, ముంబై హార్దిక్‌ను కెప్టెన్‌ చేయడం చెత్త నిర్ణయమని నేను భావించను. రోహిత్‌ అద్భుతమైన కెప్టెన్‌ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం తను టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి కనీసం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అయినా.. ఒత్తిడిని తగ్గించుకుని బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలని భావించి ఉంటాడు. 

మరో మాట.. సూర్య, బుమ్రా ముంబై పట్ల విశ్వాసంగానే ఉన్నారు. అయితే, ఇప్పుడు హార్దిక్‌ తిరిగి వచ్చాడు. కాబట్టి తనను కెప్టెన్‌ చేయడంలో తప్పేముంది? ఈ నిర్ణయాన్ని ఎందుకింత ప్రతికూల దృష్టితో చూస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే.. ఈ ప్రతికూలత తగ్గే అవకాశం ఉందని ఈ సందర్బంగా ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. 

>
మరిన్ని వార్తలు