IPL 2024: రాయల్స్‌ కెప్టెన్‌గా సంజూ వద్దు.. అతడైతే బెటర్‌: కేరళ మాజీ పేసర్‌

16 Dec, 2023 18:07 IST|Sakshi
సంజూ శాంసన్‌(PC: IPL)- శ్రీశాంత్‌

IPL 2024: ఐపీఎల్‌-2024 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అనుకున్న ఫలితాలు రాబట్టాలనుకుంటే కెప్టెన్‌ను మార్చాలని భారత మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌ అన్నాడు. సంజూ శాంసన్‌కు నిలకడలేదని.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని సూచించాడు. రాయల్స్‌కు రోహిత్‌ శర్మ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 

కాగా కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ 2021 నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు ఎడిషన్లలో మొత్తంగా 45 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టీమిండియా బ్యాటర్‌.. 22 మ్యాచ్‌లు గెలిపించాడు. 

గతేడాది సంజూ నాయకత్వంలోనే.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత రాయల్స్‌ తొలిసారి ఫైనల్‌ చేరింది. అయితే, తాజా ఎడిషన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్‌ చేరడంలోనూ విఫలమైంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు పలు ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ కెప్టెన్లను మారుస్తున్న విషయం తెలిసిందే.

టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి కేకేఆర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా.. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌ సారథి అయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది.

ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు.. ‘‘నా అభిప్రాయం ప్రకారం రాజస్తాన్‌ రాయల్స్‌ సిస్టం మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలి. ముఖ్యంగా చాలా మంది ఆటగాళ్లను మార్చాలి.

నేను రాజస్తాన్‌కు ఆడినపుడు మేనేజ్‌మెంట్‌ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేది. అప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌ భాయ్‌ కెప్టెన్‌. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశం పట్ల ఆయనకు పూర్తిగా అవగాహన ఉండేది. మైదానంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలన్న విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు.

ఇప్పుడు ఆ జట్టుకు సంజూ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, తను కెప్టెన్సీని సీరియస్‌గా తీసుకోవాలి. నాకెందుకో జోస్‌ బట్లర్‌ని కెప్టెన్‌ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అతడికి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అతడు బాగా ఆడకపోయాడన్న మాట వాస్తవమే.

అయితే, కెప్టెన్‌గా తనకున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. లేదంటే.. నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆటగాడి వైపు రాయల్స్‌ చూడాలి. రోహిత్‌ శర్మ లాంటి నాయకుడి అవసరం జట్టుకు ఉంది. 

టీమ్‌ను గెలిపించే కెప్టెన్‌ కావాలి, అంతేగానీ రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయేవాళ్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు’’ అంటూ శ్రీశాంత్‌ పరోక్షంగా సంజూ శాంసన్‌ను విమర్శించాడు. అమావాస్య- పున్నానికోసారి ఆడే వాళ్లను కెప్టెన్‌గా ఉంచితే ఫలితం ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయల్స్‌కు ఆడిన సమయంలోనే శ్రీశాంత్‌ మీద ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

చదవండి: IPL 2024: ఇలా చేయడానికి సిగ్గుండాలంటూ ఫైర్‌!.. పోస్ట్‌ డిలీట్‌ చేసిన సూర్య భార్య

>
మరిన్ని వార్తలు