#SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్‌

28 Mar, 2024 13:10 IST|Sakshi
ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ!(PC: Jio Cinema/X)

IPL 2024: సిక్సర్ల మోత.. బౌండరీల జాతర.. ముంబై బౌలింగ్‌పై సన్‌రైజర్స్‌ బ్యాటర్ల ఊచకోత చూస్తుంటే ఇది కదా అసలైన ఐపీఎల్‌ మ్యాచ్‌ మజా అనిపించింది. ముఖ్యంగా స్లో బ్యాటింగ్‌ జట్టు అనే అపఖ్యాతి మూటగట్టుకున్న సన్‌రైజర్స్‌ సొంత మైదానంలో రెచ్చిపోవడంతో అభిమానులకు కన్నుల పండుగే అయ్యింది.

ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సిక్సర్ల వర్షం కురిపిస్తూ రైజర్స్‌ ఆటగాళ్లు బ్యాట్‌ ఝులిపిస్తే.. ముంబై బౌలర్ల ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేకపోయారు. ట్రవిస్‌ హెడ్‌(24 బంతుల్లో 62), అభిషేక్‌ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్‌(28 బంతుల్లో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(34 బంతుల్లో 80 నాటౌట్‌) ఏమాత్రం జాలి లేకుండా బౌలర్లపై విరుచుకుపడ్డారు.

వెరసి ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ 277 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఆల్‌టైమ్‌ అత్యధిక రన్స్‌ స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. మరోవైపు.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభమే లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా జోరు మీదున్న ఓపెనర్లు రోహిత్‌ శర్మ(12 బంతుల్లో 26), ఇషాన్‌ కిషన్‌(13 బంతుల్లో 34) త్వరగానే అవుట్‌ కావడం ప్రభావం చూపింది.

ఆ తర్వాత నమన్‌ ధిర్‌(14 బంతుల్లో 30) కాసేపు మెరుపులు మెరిపించినా.. స్థానిక బ్యాటర్ తిలక్‌ వర్మ(34 బంతుల్లో 64) అద్భుతమైన అర్థ శతకం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(22 బంతుల్లో 42 నాటౌట్‌)తో చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా 31 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2024లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.

ఇక ఆద్యంతం ఆసక్తి రేపుతూ.. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు సెలబ్రిటీల హావభావాలు మాత్రం హైలైట్‌గా నిలిచాయి. వారు మరెవరో కాదు సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌.. ముంబై ఇండియన్స్‌ ఓనర్‌ నీతా అంబానీ.

ఎప్పుడూ ఆఖరిదాకా ఊరించి ఓటమి పాలయ్యే జట్టుగా పేరున్న రైజర్స్‌ ఉప్పల్‌లో అదరగొడుతుంటే కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా హెన్రిచ్‌ క్లాసెన్‌ సిక్సర్లు బాదినపుడు ఆమె సీట్లో నుంచి లేచి నిలబడి చిన్నపిల్లలా గెంతులు వేశారు.

అదే విధంగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కమిన్స్‌ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ కాగానే.. ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు.. రైజర్స్‌ బ్యాటర్ల ఊచకోత ఇక చూడలేనన్నట్లు నీతా అంబానీ తలపట్టుకుని కళ్లు మూసుకున్నారు.

అంతేకాదు.. ఇక ఇది అయ్యే పని కాదన్నట్లుగా కొడుకు ఆకాశ్‌ అంబానీతో కలిసి ఫోన్‌ చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 18 సిక్సర్లు, 19 ఫోర్లు బాదితే.. ముంబై 20 సిక్స్‌లు, 12 బౌండరీలు బాదింది.

చదవండి: #srhvsmi: మా బౌలర్ల తప్పు లేదు.. వారి వల్లే ఓడిపోయాం: పాండ్యా

Election 2024

మరిన్ని వార్తలు