IPL 2024 KKR VS SRH: ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్‌ రాణా 

24 Mar, 2024 12:58 IST|Sakshi

కేకేఆర్‌ పేస్‌ సంచలనం హర్షిత్‌ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రాణా.. మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ సెండాఫ్‌ ఇచ్చాడు.

ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్‌ రిఫరీ మను నయ్యర్‌ రాణా మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్‌ క్లాసెన్‌ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న​ రిఫరీ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు.  

కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలుపుకు చివరి ఓవర్‌లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. షాబాజ్‌ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్‌ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ సిక్సర్‌ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్‌ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సాల్ట్‌ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్‌ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్‌ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్‌ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. 


 

Election 2024

మరిన్ని వార్తలు