#Rohitsharma: 'అందుకే రోహిత్‌ను తప్పించాం.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు'

16 Dec, 2023 08:02 IST|Sakshi
PC: BCCI/IPL

ముంబై ఇండియన్స్‌లో ఒక శకం ముగిసింది. ముంబైను ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ.. ఇకపై ఒక సాధరణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఐపీఎల్‌- 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తప్పించింది.

అతడి స్ధానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను తమ జట్టు కొత్త నాయకుడిగా ముంబై నియమించింది. ఇక కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పర్ఫార్మెన్స్‌ మహేలా జయవర్ధనే స్పందించాడు. 2024 సీజన్‌ నుంచే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పర్ఫార్మెన్స్‌ మహేలా జయవర్ధనే తెలిపాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్‌ నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్‌ కెప్టెన్లగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్‌ నుంచే హార్దిక్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. రోహిత్‌ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది.

అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు. ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్‌ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని జయవర్ధనే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు