వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత కోహ్లి తొలిసారి ఇలా.. నా సర్వస్వం అదే! వీడియో

23 Dec, 2023 17:25 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

Virat Kohli Comments:‘నా ఆటకు టెస్టు క్రికెట్‌ పునాది. ఇదొక చరిత్ర. ఒక సంస్కృతి. వారసత్వం. సర్వస్వం ఇదే. ప్రత్యర్థి జట్టుతో నాలుగు- ఐదు రోజుల పాటు పోటీపడటం అన్నింటికంటే భిన్న అనుభవాన్ని ఇస్తుంది.

బ్యాటర్‌గా.. జట్టుగా ఈ ఫార్మాట్లో ఆడటం వల్లే పూర్తి సంతృప్తి లభిస్తుంది. క్రీజులో గంటల తరబడి నిలబడి.. జట్టును గెలిపించే అవకాశం దక్కడం అన్నిటికంటే ప్రత్యేకమైన భావన.

నేను సంప్రదాయ క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అందుకే నాకు టెస్టులంటే అమితమైన ఇష్టం. టీమిండియా తరఫున వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. 

టెస్టు క్రికెటర్‌ కావాలన్న నా చిరకాల కల నెరవేరడమే గాకుండా ఇక్కడిదాకా వచ్చినందుకు గర్వంగా ఉంది’’ అని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులు ఆడటమే అత్యంత సంతృప్తినిస్తుందని పేర్కొన్నాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి
కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో విరాట్‌ కోహ్లి సత్తా చాటిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ రన్‌మెషీన్‌.. ఐసీసీ ఈవెంట్లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్‌ కోహ్లి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు
సఫారీ గడ్డపై భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదన్న అపవాదు చెరిపివేసేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి స్టార్‌ స్పోర్ట్స్‌ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లి.. తన కెరీర్‌లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు
ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దక్షిణాఫ్రికా నుంచి అనూహ్యంగా స్వదేశానికి తిరిగి బయల్దేరిన విషయం తెలిసిందే. ‘వ్యక్తిగత కారణాలతో’ కోహ్లి వెనక్కి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కోహ్లి ఇంటికి వెళ్లడంపై స్పష్టమైన కారణం ఏమిటో తెలియకపోయినా... ఈ విషయంపై అతను ముందే బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ‘‘గురువారమే కోహ్లి భారత్‌కు బయల్దేరాడు. 

ఇది ముందే నిర్ణయించుకున్నది. అందుకే అతను భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో కూడా ఆడలేదు’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు.

అయితే ఈ నెల 26 నుంచి జరిగే తొలి టెస్టు సమయానికి అతను మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుంటాడని, మ్యాచ్‌ కూడా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు.  మరోవైపు ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చేతి వేలి గాయం కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు.

చదవండి: ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్‌ రాహుల్‌

>
మరిన్ని వార్తలు