వన్డే ఫార్మాట్‌లో మరో డబుల్‌ సెంచరీ.. ఈసారి..!

13 Aug, 2023 19:59 IST|Sakshi

రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే‌ మరో డబుల్‌ సెంచరీ నమోదైంది. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 13) జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ కెప్టెన్‌ జేమ్స్‌ బ్రేసీ అజేయ డబుల్‌ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్‌; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.

బ్రేసీతో పాటు మరో ఓపెనర్‌ క్రిస్‌ డెంట్‌  (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్‌ ప్రైస్‌ (83 బంతుల్లో 77;  8 ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో గ్రేమ్‌ వాన్‌ బుర్రెన్‌ (12 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. సోమర్‌సెట్‌ బౌలర్లలో లాంగ్‌రిడ్జ్‌, జార్జ్‌ థామస్‌, షోయబ్‌ బషీర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ టోర్నీలో డబుల్‌ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్‌సెటే కావడం విశేషం. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా, గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జేమ్స్‌ బ్రేసీ సోమర్‌సెట్‌ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో సోమర్‌సెట్‌ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్‌తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్‌రిడ్జ్‌ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్‌ ఊచకోత కోశారు.  

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఏడో అత్యధిక స్కోర్‌..
లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్‌ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్‌ చేసింది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్‌ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ 498 పరుగులు స్కోర్‌ చేసింది. 

పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌..
లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఆటగాడు జేమ్స్‌ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్‌; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ తమిళనాడు ఆటగాడు ఎన్‌ జగదీశన్‌  (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్‌ బ్రౌన్‌ (268), రోహిత్‌ శర్మ (264), షార్ట్‌ (257), శిఖర్‌ ధవన్‌ (248),పృథ్వీ షా (244), మార్టిన్‌ గప్తిల్‌ (237), ట్రవిస్‌ హెడ్‌ (230), డంక్‌ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు