ఆ బ్యాలెన్సింగ్‌లో కిర్రాక్‌ వెంకీ.. రైట్‌ టు లెఫ్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎందుకు మారాడంటే..

24 Sep, 2021 12:43 IST|Sakshi

చూడడానికి సన్నగా పుల్లలాగా ఉన్నాడు.. ఓపెనర్‌గా వీడసలు హిట్టింగ్‌ చేయగలడా?.. అనుకున్న చాలామందికి  బ్యాట్‌ జులిపించి గట్టి సమాధానం ఇచ్చాడు వెంకటేష్‌ అయ్యర్‌.  ఐపీఎల్‌ 2021 దుబాయ్‌ ఫేజ్‌లో ఈ ఇరవై ఆరేళ్ల ఏళ్ల ప్లేయర్‌..  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున ఇరగదీస్తున్నాడు. వరుస రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా దుమ్మురేపి మాజీలతో, క్రికెట్‌ ప్రియులతో  శెభాష్‌ అనిపించుకున్నాడు. అయితే ఎడమ చేతి బ్యాటింగ్‌ స్టయిల్‌ను వెంకటేష్‌.. బలవంతంగా అలవర్చుకున్నాడట. అందుకే కారణం ఏంటో అతని ఆసక్తికర నేపథ్యం చదివితే మీకే తెలుస్తుంది.
 


వెంకటేష్‌ అయ్యర్‌.. పూర్తిపేరు వెంకటేష్‌ రాజశేఖరన్‌ అయ్యర్‌. స్వస్థలం మధ్యప్రదేశ్‌ స్వస్థలం ఇండోర్‌. పుట్టింది 25 డిసెంబర్‌ 1994లో..

19 ఏళ్ల వయసుదాకా అట్టట్ట క్రికెట్‌ ఆడిన వెంకటేశ్‌.. మంచి ప్రోత్సహం లభించడంతో క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. చదువు-క్రికెట్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడం కోసమే ఎంబీఏను ఎంచుకున్నాడు. 

► రజినీకాంత్‌కు చిన్నప్పటి నుంచి వీరాభిమాని.  తలైవా సినిమాల కోసమే ఇండోర్‌ నుంచి చెన్నైకి వెళ్లి.. గుంపులో సినిమాలు చూసిన రోజులున్నాయి అతనికి. అంతేకాదు ఎన్‌ వాజి.. తని వాజీ(నా దారి రహదారి) డైలాగ్‌ను బాగా ఒంటబట్టిచుకున్నాడు వెంకటేష్‌.

ఇరవై ఆరేళ్ల ఈ దూకుడు చూపిస్తున్న ఆటగాడికి బ్యాటింగ్‌లో ఇన్‌స్పిరేషన్‌ ఎవరో తెలుసా? ‘ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా’, దాదా సౌరవ్‌ గంగూలీ.

మొదట్లో కుడి చేతి బ్యాట్స్‌మన్‌ అయిన వెంకటేష్‌.. దాదా స్ఫూర్తితోనే ఎడమ చేతి బ్యాటింగ్‌ను అలవాటు చేసుకున్నాడట. ఈ క్రమంలో దాదా షాట్లను సైతం అనుకరించేవాడినని చెప్తున్నాడు వెంకీ. అంతేకాదు గంగూలీలా కుడి చేతి మీడియం బౌలింగ్‌ సైతం అలవాటు చేసుకున్నాడు.

‘‘నిజాయితీగా చెప్పాలంటే ఐపీఎల్‌ ప్రాంఛైజీల్లో కేకేఆర్‌ నా తొలి ప్రాధాన్యం. కారణం.. గతంలో దాదా కెప్టెన్‌గా వ్యవహరించడమే’’.. ముంబైతో మ్యాచ్‌ గెలిచిన అనంతరం వెంకటేష్‌ చెప్పిన మాటలివి. 

సయ్యద్‌ ముస్తఖ్‌ అలీ టీ20 టోర్నమెంట్‌ కిందటి సీజన్‌ వరకు వెంకటేష్‌ అయ్యర్‌..  ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగేవాడు.  అయితే భారత జట్టు మాజీ వికెట్‌ కీపర్‌, మధ్యప్రదేశ్‌ కోచ్‌ అయితే చంద్రకాత్‌ పండిట్‌ బలవంతంగా వెంకటేష్‌ను ఓపెనర్‌గా దించాడు. అయిష్టంగానే ఓపెనర్‌గా మారిన వెంకటేష్‌.. క్రమంగా సత్తా చాటడం ప్రారంభించాడు.  ఒకవేళ ఓపెనర్‌గా విఫలమైనా..  వెంకటేష్‌ నిలదొక్కుకోగలడనే నమ్మకంతో  చంద్రకాంత్‌ పని చేశాడట.

ఆ టోర్నీలో ఓపెనర్‌గా 149.34 స్ట్రైక్ రేటుతో 227 పరుగులు సాధించాడు.  ఆ వెంటనే విజయ్‌ హజారే ట్రోఫీలోనూ(50 ఓవర్ల) పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 198 పరుగులు చేశాడు.

దేశీవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన ఐపీఎల్‌ ప్రాంఛైజీల దృష్టి అతని మీద పడేలా చేసింది. ఆపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. 

ఐపీఎల్‌2021 ఫస్ట్‌ ఫేజ్‌లో బెంచ్‌కే పరిమితం అయినందుకు బాగా ఫీలయ్యాడు. ఆ ఎదురు చూపులే అతనికి అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. 

ప్రస్తుతం దుబాయ్‌ ఫేజ్‌లో మెరుగైన ప్రదర్శన ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు వెంకటేష్‌ అయ్యర్‌.

 

ఆర్బీబీతో ఐపీఎల్‌ డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వెంకటేష్‌.. గురువారం అబుదాబిలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ డెబ్యూ అర్థశతకంతో(30 బంతుల్లో 53 పరుగులు) అదరగొట్టాడు. తద్వారా 156 పరుగుల కేకేఆర్‌ ఛేజింగ్‌లో వెంకటేష్‌ కీ రోల్‌ పోషించాడు. 

వెంకటేష్‌ అయ్యర్‌.. స్టడీస్‌లోనూ టాపర్‌. కెరీర్‌తో పాటు ఆటకు సమాన ప్రాధాన్యం ఇవ్వడమే ఇతని ప్రత్యేకత. 

అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ ఎంఎన్‌సీ కంపెనీలో మంచి ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగానికి వదులుకోవాల్సి వచ్చిందట. అది అతనికి చాలా బాధగా అనిపించిందట.

 

ఎంబీఏ చదువుతున్న టైంలో ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ రాసి.. ఆపై ఛత్తీస్‌గఢ్‌ జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌కి హాజరయ్యాడు. అదృష్టం ఏంటంటే.. ఆ మ్యాచ్‌లో అతను కొట్టిన శతకం.. మధ్యప్రదేశ్‌ రంజీ టీంకి అతన్ని ఎంపిక చేసింది. అఫ్‌కోర్స్‌.. ఎగ్జామ్‌ కూడా పాసయ్యాడు

క్రికెట్‌ దిగ్గజాలతో ప్రస్తుతం మంచి భవిష్యత్తున్న ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్న వెంకటేష్‌ అయ్యర్‌.. ముందు ముందు మరింత మెరుగైన ప్రదర్శన అందించాలని ఆశిద్దాం.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు