World cup 2023: 'పాక్‌, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'

3 Oct, 2023 07:25 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఎంచుకున్నాడు.  భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. 

"రాబోయే ఏడు వారాలు క్రికెట్‌ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ భారత్‌కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్‌ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ జట్లు నాకౌట్‌ దశ సెమీఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా.

మాజీ విజేత భారత్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్లను కచ్చితమైన టైటిల్‌ ఫేవరెట్స్‌గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్‌ పటేల్‌ స్థానంలో వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ జట్టులోకి రావడం భారత్‌కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్‌ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకుంది.

బెన్‌ స్టోక్స్‌ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్‌ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్‌లోనూ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్‌ల నుంచి ఐపీఎల్‌ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది.

ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్‌లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్‌కు పేరుంది. కేన్‌ విలియమ్సన్‌ రూపంలో ఆ జట్టులో సూపర్‌స్టార్‌ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్‌ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.
చదవండి: ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన న్యూజిలాండ్‌

మరిన్ని వార్తలు