Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా'

1 Jun, 2022 16:40 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. కెప్టెన్‌గా అన్నీ తానై నడిపించిన పాండ్యా ఫైనల్లోనూ 32 పరుగులు చేయడంతో పాటు మూడు కీలక వికెట్లు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడమేగాక జట్టుకు టైటిల్‌ను అందించాడు.

అయితే ఇదే హార్దిక్‌ పాండ్యాకు ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు క్రికెట్‌ అభిమానుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి. గాయంతో టీమిండియాకు కొన్నినెలల పాటు దూరమవ్వడం.. ఆ తర్వాత జట్టులోకి వచ్చినా దారుణ ప్రదర్శన చేయడం.. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా కాకుండా ఒక బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగినప్పటికి ఘోరంగా విఫలమవ్వడంతో పాండ్యా విమర్శలు వచ్చాయి. అయితే వీటిన్నింటిని ఓర్చుకున్న పాండ్యా తనను విమర్శించిన వారికి ఐపీఎల్‌తోనే సమాధానం ఇచ్చాడు. జాస్‌ బట్లర్‌, కేఎల్‌ రాహుల్‌ తర్వాత సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పాం‍డ్యా ఔరా అనిపించాడు.

ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ ప్రదర్శనపై సోదరుడు కృనాల్‌ పాండ్యా ఎమోషనల్‌ నోట్‌ రాయడం వైరల్‌గా మారింది. తన తమ్ముడు దీనికోసం ఎంత కష్టపడ్డాడో కృనాల్‌ వివరించాడు. ''కంగ్రాట్స్‌ హార్దిక్‌.. ఈ విజయం వెనుక నీ కష్టం ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు. ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ప్రతీరోజు తెల్లవారుజామునే నిద్ర లేవడం.. గంటల పాటు ట్రైనింగ్‌ సెషన్‌లో గడపడం, మానసికంగా దృడంగా తయారయ్యేదుకు చాలా కష్టపడ్డావు. నీ నిజాయితీ ఊరికే పోలేదు. ఐపీఎల్‌ టైటిల్‌ రూపంలో నీ ముందుకొచ్చింది. కెప్టెన్‌గా ఐపీఎల్‌ టైటిల్‌ అందుకోవడంలో వంద శాతం నువ్వు అర్హుడివి. ఇక  క్రికెట్‌ ఫ్యాన్స్‌ నీ గురించి ఎలా విమర్శించారో నాకు తెలుసు. అందరు నిన్ను మరిచిపోయే స్టేజ్‌లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చావు.. నీ పేరు మళ్లీ వాళ్ల నోళ్లలో నానేలా చేశావు.'' అంటూ ఎమెషనల్‌ అయ్యాడు.

ఇక ఐపీఎల్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్యా దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. జూన్‌ 9 నుంచి మొదలుకానున్న టి20 సిరీస్‌లో హార్దిక్‌ తన మెరుపులు మెరిపిస్తాడోమే చూడాలి. ఇక కృనాల్‌ పాండ్యా ఈ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తరపున ఆడాడు. సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోని కృనాల్‌ 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు.

చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు

ఐపీఎల్‌ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా..!

మరిన్ని వార్తలు