పెరెజ్‌కు పాజిటివ్‌

1 Aug, 2020 01:06 IST|Sakshi

కరోనా బారిన రేసింగ్‌ పాయింట్‌ జట్టు ఫార్ములావన్‌ డ్రైవర్

ఇటీవల మెక్సికో వెళ్లొచ్చిన పెరెజ్‌

బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి రేసుకు దూరం

హుల్కెన్‌బర్గ్‌కు ఊహించని అవకాశం

సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా మొదలైన ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో ఎలాంటి ఆటంకం లేకుండా తొలి మూడు రేసులు సాఫీగా ముగిశాయి. కానీ నాలుగో రేసు సన్నాహాలు మొదలుకావడానికి ఒకరోజు ముందుగా కోవిడ్‌ –19 తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. రేసింగ్‌ పాయింట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెక్సికో డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. దాంతో అతను ఈనెల 2న, 9న జరగాల్సిన బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి రేసులకు దూరమయ్యాడు. ‘నేను చాలా నిరాశగా ఉన్నాను. నా కెరీర్‌లోని గడ్డురోజుల్లో ఇదొకటి. నా తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో హంగేరి గ్రాండ్‌ప్రి రేసు ముగిశాక ప్రైవేట్‌ విమానంలో మెక్సికోకు వెళ్లాను. రెండు రోజులు అక్కడే ఉన్నాను. బహుశా నాకు కరోనా వైరస్‌ మెక్సికోలోనే సోకి ఉంటుంది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన వెంటనే నాకు పరీక్ష నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. అయితే  నాలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు.

ఇంగ్లండ్‌ కోవిడ్‌–19 నిబంధనల ప్రకారం నేను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటాను’ అని 30 ఏళ్ల పెరెజ్‌ అన్నాడు. 2014 నుంచి 2018 వరకు భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పెరెజ్‌... ఈ సీజన్‌లో జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి తొలి రెండు రేసుల్లోనూ ఆరో స్థానంలో నిలువగా... హంగేరి గ్రాండ్‌ప్రిలో ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రికి పెరెజ్‌ దూరం కావడంతో అతని స్థానంలో జర్మనీ డ్రైవర్‌ నికో హుల్కెన్‌బర్గ్‌కు రేసింగ్‌ పాయింట్‌ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం లభించింది. గత సీజన్‌లో రెనౌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హుల్కెన్‌బర్గ్‌ను ఈసారి ఆ జట్టు తప్పించింది. పెరెజ్‌ కరోనా బారిన పడ్డాడని తెలిసిన వెంటనే ఖాళీగా ఉన్న హుల్కెన్‌బర్గ్‌కు రేసింగ్‌ పాయింట్‌ టీమ్‌ ప్రిన్సిపల్‌ ఓట్మర్‌ ఫోన్‌ చేసి తమ జట్టు తరఫున డ్రైవింగ్‌ చేయాలని కోరాడు. దాంతో ఊహించని అవకాశం దక్కడంతో హుల్కెన్‌బర్గ్‌ వెంటనే జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చేశాడు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ పాల్గొన్నాడు.

మరిన్ని వార్తలు