Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్‌

30 Mar, 2022 16:42 IST|Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నట్లు తేలినందున మార్ష్‌ పాక్‌తో జరగనున్న మిగతా వన్డేలు ఆడడం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గాయం తీవ్రత పెద్దగా లేదని రెండు వారాలు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఒక రకంగా ఆస్ట్రేలియాకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అయినప్పటికి.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం ఇది గుడ్‌ న్యూస్‌.

ఎందుకంటే గాయపడిన మార్ష్‌ స్వదేశం వెళ్లకుండా ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరినప్పటికి ఒకటి, రెండు మ్యాచ్‌లకు  దూరమైనప్పటికి ఆ తర్వాత సీజన్‌ అంతా అందుబాటులో ఉండనున్నాడు.  భారత్‌కు రానున్న మార్ష్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌లో ఫిజియో పాట్రిక్‌ ఫర్హాత్‌ పర్యవేక్షణలో రికవరీ అవ్వనున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా బౌలర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జే పాట్రిక్‌ ఫర్హాత్‌ నేతృత్వంలోనే కోలుకుంటున్నాడు. ఏప్రిల్‌ 7న నోర్జ్టే ఢిల్లీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మార్ష్‌ కూడా ఏప్రిల్‌ రెండో వారంలో జట్టుతో కలిసే అవకాశం ఉంది. 

కాగా మిచెల్‌ మార్ష్‌ గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. అదే తరహా మెరుపులు మార్ష్‌ నుంచి ఐపీఎల్‌లో చూసే అవకాశం ఉంది. మరో ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ప్రత్యేక​ అనుమతితో వార్న్‌ అంత్యక్రియల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. వచ్చే వారంలో వార్న్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరవచ్చు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ తర్వాతి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముస్తాఫిజుర్‌ రెహ్మాన్, లుంగీ ఎన్గిడి అందుబాటులోకి రానున్నారు.

చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్‌ అయితే ఎలా?

Virat Kohli: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న రికార్డులు 

మరిన్ని వార్తలు