WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావొచ్చు: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

30 Sep, 2023 14:36 IST|Sakshi

ICC ODI World Cup 2023: అనుకోకుండా కొన్ని కొన్ని.. అలా జరిగిపోతూ ఉంటాయంతే! టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ విషయంలో ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు ఇలాగే జరిగింది. అనూహ్యరీతిలో టీ20 వరల్డ్‌కప్‌-2022 జట్టులో చోటు దక్కించుకున్న ఈ చెన్నై బౌలర్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టీమ్‌లోనూ ఊహించని రీతిలో స్థానం సంపాదించాడు.

గత ఆరేళ్లలో కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌కు అక్షర్‌ పటేల్‌ గాయం రూపంలో ఐసీసీ ఈవెంట్‌ ఆడే అవకాశం దక్కింది. అది కూడా సొంతగడ్డపై మెగా టోర్నీలో భాగమయ్యే అదృష్టం వరించింది. 

అక్షర్‌ గాయం.. అశ్విన్‌ పాలిట వరంగా..
ఆసియా వన్డే కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అక్షర్‌ గాయపడటంతో తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు అశ్విన్‌. అయితే, ఈ గుజరాతీ బౌలర్‌ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు మేనేజ్‌మెంట్‌ పిలుపునిచ్చింది.

ఇలా అనుకోకుండా సువర్ణావకాశం లభించడంపై స్పందించిన అశ్విన్‌ హర్షం వ్యక్తం చేశాడు. విధి, పరిస్థితుల ప్రభావం వల్లే తాను ప్రపంచకప్‌ ఈవెంట్‌లో భాగం అవుతున్నానని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్‌ కూడా కావొచ్చని అశ్విన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడనే సంకేతాలు ఇచ్చాడు.

ప్రపంచకప్‌-2023 వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా గువాహటి వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ శనివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో జట్టుతో పాటు అక్కడికి చేరుకున్న అశ్విన్‌.. దినేశ్‌ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

అదొక్కటే ధ్యేయం
నిజానికి నువ్వు జోక్‌ చేస్తున్నావే అనుకున్నా. అస్సలు ఇక్కడ ఈరోజు నేనిలా ఉంటానని ఊహించలేదు. మేనేజ్‌మెంట్‌ నాపై నమ్మకం ఉంచింది. ఇలాంటి టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే మనం ముందుకు సాగగలం.

ఆటను ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. బహుశా టీమిండియా తరఫున నాకిదే చివరి ప్రపంచకప్‌ టోర్నీ కావొచ్చు. కాబట్టి టోర్నమెంట్‌ను నేను ఎంతగా ఎంజాయ్‌ చేస్తాననేదే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా 37 ఏళ్ల అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో యువ ఆఫ్‌ స్పిన్నర్‌ నుంచి పోటీ ఉంది. టీమిండియా యంగ్‌ గన్‌ తిలక్‌ వర్మ కూడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు.

అశూ రిటైర్‌ అయ్యే అవకాశం
కాబట్టి వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడే అవకాశాలు తక్కువే. మరోవైపు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి స్టార్లు సైతం పొట్టి ఫార్మాట్‌లో యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తమ స్థానాలను త్యాగం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

కాబట్టి అశూకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్‌ కావొచ్చు. అదృష్టం వెంటపడితే మాత్రం మళ్లీ ఏదో మ్యాజిక్‌ జరిగి జట్టులోకి వచ్చినా రావొచ్చు!! లేదంటే వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం!!

చదవండి: వరల్డ్‌కప్‌ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు?

మరిన్ని వార్తలు