T20 WC 2022: 'రోహిత్‌, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్‌ బ్యాటర్‌'

29 Oct, 2022 11:31 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి దుమ్ము రేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుస అర్ద సెంచరీలతో విరాట్‌ దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి(82 నాటౌట్‌).. అనంతరం నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్‌) కూడా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 144 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా కింగ్‌ కోహ్లి కొనసాగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియాలో బెస్ట్‌ బ్యాటర్‌ ఎవరంటే టక్కున గుర్తు వచ్చేది విరాట్‌ కోహ్లినే. గానీ ఇందుకు భిన్నంగా భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ స్పందించాడు. గంభీర్ కోహ్లీపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పాల్గొన్న గంభీర్‌కు.. ప్రస్తుత భారత జట్టులో  బెస్ట్‌ బ్యాటర్‌ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా..టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌ను మించిన ఆటగాడు ఎవరూ లేరని గంభీర్‌ సమాదానిమిచ్చాడు.

"ప్రస్తుత భారత జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ను మించిన ఆటగాడు ఎవరూ లేరు. రోహిత్‌, రాహుల్‌, కోహ్లిలా తొలి ఆరు ఓవర్లలో(పవర్‌ ప్లే)లో బ్యాటింగ్‌ చేసే సదుపాయం సూర్యకు లేదు. అతడు బ్యాటింగ్‌  చేసేటప్పడు మైదానం నలుమూలల ఫీల్డర్లు ఉంటారు. అటువంటి సమయంలో భారీ షాట్లు ఆడి, అవతలి ఆటగాడికి ఒత్తిడి తగ్గించడం అంత సులభం కాదు. భారత జట్టులో ఎదుర్కొన్న తొలి బంతికి బౌండరీ కొట్టగలిగే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు యాదవ్‌ మాత్రమే.

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ సూర్యలా ఆడాలేరు. అదే విధంగా రోహిత్ శర్మ, రాహుల్‌, విరాట్‌ కోహ్లిలపై ఒత్తిడిని సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే తగ్గించగలడు. మిడిలార్డర్‌లో సూర్య ఉన్నాడు కాబట్టే అందుకే  ఈ ముగ్గురూ తమకు నచ్చిన విధంగా ఆడతారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బాగా రాణిస్తే ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ను భారత్‌ గెలవడం అంత కష్టం ఏమి కాదు.

ఇక టాప్ 3లో రోహిత్‌, రాహుల్‌ విరాట్‌, హాఫ్ సెంచరీలు చేస్తారు, సెంచరీలు కొడతారు. కానీ వీరికంటే  సూర్య, హార్దిక్‌ ఆడిన ఇన్నింగ్స్‌లే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని గంభీర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పేర్కొన్నాడు.

 
చదవండిT20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'

మరిన్ని వార్తలు