T20 WC AUS Vs AFG: రషీద్‌ ఖాన్‌ సంచలన ఇన్నింగ్స్‌.. ఆసీస్‌కు ముచ్చెమటలు

4 Nov, 2022 17:56 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో శుక్రవారం ఆస్ట్రేలియాకు అఫ్గానిస్తాన్‌ ముచ్చెమటలు పట్టించింది. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌(23 బంతుల్లో 48 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడడంతో అఫ్గానిస్తాన్‌ దాదాపు విజయానికి చేరువుగా వచ్చింది. 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో రషీద్‌ ఒక్కసారిగా విజృంభించాడు.

కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ ఐదు, ఆరు బంతులను రెండు సిక్సర్లుగా మలిచాడు. ఈ దెబ్బకు అఫ్గానిస్తాన్‌ లక్ష్యం 12 బంతుల్లో 33 పరుగులకు మారింది. ఈ దశలో హాజిల్‌వుడ్‌ 19వ ఓవర్‌ వేయగా.. ఆ ఓవర్‌లో 10 పరుగులు పిండుకున్న రషీద్‌ సమీకరణాలను 6 బంతుల్లో 22 పరుగులుగా మార్చాడు. ఇక చివరి ఓవర్‌లో రసూలీ వైడ్‌ బాల్‌కు రనౌట్‌ అయినప్పటికి రషీద్‌ ఖాన్‌ ఒక ఫోర్‌, సిక్స్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు.

రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో రెండు పరుగులు రావడం.. ఆ తర్వాత బంతికి ఫోర్‌ కొట్టినప్పటికి విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో నిరాశలో కూరుకుపోయిన రషీద్‌ ఖాన్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అభినందించడం విశేషం. మొత్తానికి అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో ఓడినప్పటికి రషీద్‌ పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఈ ప్రపంచకప్‌లో నేరుగా సూపర్‌-12లో ఆడిన అఫ్గానిస్తాన్‌కు అంతగా కలిసి రాలేదు. రెండు మ్యా్చ్‌లు వర్షంతో రద్దు అవడం వారి కొంపముంచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పొందిన ఆఫ్గన్‌ శ్రీలంక చేతిలోనూ ఓటమిపాలైంది. అయితే ఆ‍స్ట్రేలియాకు మాత్రం అఫ్గానిస్తాన్‌ చుక్కలు చూపించింది. ఒక దశలో అఫ్గానిస్తాన్‌ గెలిచేలా కనిపించడంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరడం కష్టమే అనుకున్నారు. కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 52, మిచెల్‌ మార్ష్‌ 45, స్టోయినిస్‌ 25, వార్నర్‌ 25 పరుగులు చేశారు.

చదవండి: మ్యాచ్‌లో హైడ్రామా.. మ్యాక్స్‌వెల్‌పై బౌలర్‌ ఆధిపత్యం

వికెట్ల ముందే ఆడాలని రూల్‌ లేదు.. అందుకే వెనకాల

మరిన్ని వార్తలు