వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను.. రోహిత్‌ శర్మ భావోద్వేగం

13 Dec, 2023 16:56 IST|Sakshi

2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 

వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియట్లేదని హిట్‌మ్యాన్‌ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు.

ఆ మనోవేదనను అధిగమించి మైదానంలో​కి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు.

A post shared by Team Ro (@team45ro)

చిన్నతనం నుంచి వన్డే వరల్డ్‌కప్‌లు చూస్తూ పెరిగానని, వరల్డ్‌కప్‌ గెలవడం అనేది గొప్ప బహుమతిగా భావించేవాడినని గుర్తు చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌ గెలవడం కోసం జట్టు మొత్తం కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించిందని, అంతిమంగా ఫలితం నిరాశపరిచి​ందని విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్‌ గెలవడం కోసం జట్టుగా చేయవలసిందంతా చేశామని, ఫలితం ఊహించిన విధంగా రాకపోవడం జట్టు మొత్తాన్ని తీవ్ర బాధించిందని వాపోయాడు. 

ఫైనల్లో ఓటమి అనంతరం తన జర్నీ అనుకున్నంత ఈజీగా సాగలేదని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. అంతిమంగా ఆటలో గెలుపోటములు సహజమని, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించాడు. 

కాగా, హిట్‌మ్యాన్‌ వరల్డ్‌కప్‌ ఓటమి అనంతరం ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో రోహిత్‌ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. 


 

>
మరిన్ని వార్తలు