Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్‌ అవుతుందో అర్థం కాలేదు!.. కానీ..

12 Jan, 2022 12:45 IST|Sakshi

సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్‌ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. 

దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌, భర్త పారుపల్లి కశ్యప్‌ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్‌లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 

దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్‌వే’’ అని ట్వీట్‌ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్‌ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్‌లో ట్రెండ్‌ అవడం చూసి ఆశ్చర్యపోయాను.

అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం విదితమే.

చదవండి: SA vs IND: జస్‌ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్‌ కెప్టెన్‌.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు