Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే!

27 Apr, 2022 15:42 IST|Sakshi
రిషభ్‌ పంత్‌- సంజూ శాంసన్‌(PC: IPL/BCCI)

రాజస్తాన్ రాయల్స్‌.. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టు. అయితే ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాత మారింది. వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకువచ్చిందీ సంజూ శాంసన్‌ బృందం. 

ఓపెనర్‌ జోస్‌​ బట్లర్‌ భీకర ఫామ్‌ జట్టుకు కలిసి వస్తోంది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బ్యాట్‌ విదిలించడం, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌ వంటి యువ ఆటగాళ్లు రాణిస్తుండటం.. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌ చేరడంతో మరింత బలం పుంజుకుంది. 

వ్యక్తిగతంగానూ సంజూ శాంసన్‌కు ఈ సీజన్‌ బాగా కలిసి వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి అతడు 228 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 55. 

అయితే, రానున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఈ ప్రదర్శన సరిపోదని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ అభిప్రాయపడ్డాడు. రిషభ్‌ పంత్‌ రూపంలో తీవ్రమైన పోటీ ఉన్న తరుణంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు. షాట్‌ సెలక్షన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో సంజూ అవుటైన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

ఈ మేరకు ఇయాన్‌ బిషప్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ దానిని కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. నిలకడగా ఆడలేకపోతున్నాడు. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నాడు. జోస్‌ బట్లర్‌ పెద్దగా స్కోర్‌ చేయనప్పుడు సంజూ ఆ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.

సంజూ ఇప్పుడు కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ.. వనిందు హసరంగ బౌలింగ్‌లో అవుటైన తీరు షాట్‌ సెలక్షన్‌ విషయంలో అతడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి హెచ్చరిస్తోంది. నిజానికి నేను సంజూ శాంసన్‌కు అభిమానిని. ఎన్నో ఏళ్లుగా తన ఆటను గమనిస్తున్నా. జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాన్ని అతడు చేజేతులా దూరం చేసుకుంటున్నాడనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.

కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో హసరంగ బౌలింగ్‌ను తప్పుగా అంచనా వేసిన సంజూ.. రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయి బౌల్డ్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌, మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. రియాన్‌ పరాగ్‌ 56 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీపై రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

చదవండి👉🏾 IPL 2022: వాళ్లు అదరగొడుతున్నారు.. ఆ మూడు జట్లే ఫేవరెట్‌.. ఎందుకంటే!
చదవండి👉🏾IPL 2022: వేలంలో ఏమిటో ఇదంతా అనుకున్నా.. కానీ ఇప్పుడు ఆ రెండు జట్లు సూపర్‌!

Poll
Loading...
మరిన్ని వార్తలు