Virender Sehwag: 'వచ్చే టి20 వరల్డ్‌కప్‌లో వారి మొహాలను చూడొద్దనుకుంటున్నా'

13 Nov, 2022 10:16 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఓటమి తర్వాత టీమిండియాపై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పోరాడి ఓడిపోయుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదేమో.. కానీ పేలవమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూడడమే ఇందుకు కారణం. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన మనసులోని మాటను బయటపెట్టాడు. వచ్చే టి20 ప్రపంచకప్‌లో కొన్ని మొహాలను తాను చూడదలచుకోలేనని.. వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

''కచ్చితంగా భారత జట్టులో మార్పులు ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే ప్రపంచకప్‌లో నాకు కొన్ని మొహాలను చూడాలని లేదు. 2007 టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాది ఇదే పరిస్థితి. అప్పటికి జట్టులో సీనియర్లుగా ఉన్న కొంతమంది ఆ ప్రపంచకప్‌లో ఆడలేదు. దీంతో వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయి. జట్టు నిండా కుర్రాళ్లు.. ధోని నాయకత్వం.. వెరసి ఎలాంటి అంచనాలు లేకుండా తొలి ప్రపంచకప్‌ను అందుకున్నాం. ఇప్పుడు కూడా టీమిండియా ఇదే స్థితిలో ఉంది.

అందుకే వచ్చే 2024 టి20 ప్రపంచకప్‌ నాటికి వీలైనంత ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అది ఇప్పటి నుంచి మొదలుపెడితేనే బాగుంటుదనేది నా అభిప్రాయం. ఇక డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్న కొత్త సెలక్షన్‌ కమిటీకి జట్టు ఎంపిక ఒక సవాల్‌గా మారనుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచిస్తే రెండేళ్లలో మనం అనుకున్న దానికంటే బలమైన జట్టును తయారు చేయొచ్చు. అయితే సెలక్షన్‌ కమిటీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: వరల్డ్‌కప్‌ గెలవడం కంటే, టీమిండియాను ఓడించడమే ముఖ్యం: పాక్‌ వైస్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు