IPL RR Vs KKR: ఆరోజేమో అలా.. ఇప్పుడిలా.. పాపం మెకల్లమ్‌.. తలెత్తుకోండి బాయ్స్‌!

19 Apr, 2022 14:41 IST|Sakshi
PC: IPL/BCCI

నాడు... పరుగుల సునామీ సృష్టించిన మెకల్లమ్‌

బ్యాటర్‌గా నాడు విజయం.. కోచ్‌గా ‘అదే రోజున’ చేదు అనుభవం

తలెత్తుకోండి బాయ్స్‌

IPL 2022 RR Vs KKR: పదిహేనేళ్ల క్రితం... ఏప్రిల్‌ 18న... కోల్‌కతా నైట్‌రైడర్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య పోరుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు తెరలేచింది. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌(ఏప్రిల్‌)లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని క్రికెట్‌ ప్రేమికులు మర్చిపోలేరు.

వైభవోపేతంగా ఆరంభమైన మొదటి సీజన్‌ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌,ఆర్బీబీ పోటీపడ్డాయి. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఒక్కసారిగా విజృంభించాడు..
కేకేఆర్‌ తరపున బరిలోకి దిగిన కివీస్‌ బ్యాటర్‌ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్‌.. ఆ తర్వాత విజృంభించాడు. నాలుగు బంతుల్లో 18 పరుగులు సాధించి తన ఖాతా తెరిచాడు.

ఇక అంతే.. ఆ తర్వాత మెల్లకమ్‌ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేయడం ఏ బౌలర్‌కూ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులతో మెకల్లమ్‌ అజేయంగా నిలిచాడు. మెకల్లమ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ మూలంగా ఆర్సీబీ ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్‌.
 
ప్లేయర్‌  ఆఫ్‌ ది మ్యాచ్‌..
క్రికెట్‌ అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందించిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 15.1 ఓవర్లలోనే 82 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో 140 పరగుల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఇక కేకేఆర్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా నిలిచాడు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించడంతో కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. యాజమాన్యానికి ఈ మ్యాచ్‌ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 

అయితే, విశేషం ఏమిటంటే.. నాడు కేకేఆర్‌ బ్యాటర్‌గా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మెకల్లమ్‌.. ఐపీఎల్‌-2022లో హెడ్‌కోచ్‌గా తమ జట్టును మాత్రం ఈ ప్రత్యేకమైన రోజున(ఏప్రిల్‌ 18)న విజేతగా చూడలేకపోయాడు. ఐపీఎల్-2022లో భాగంగా.. తొలి సీజన్‌ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించినా.. 17వ ఓవర్లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజువేంద్ర చహల్‌ తన అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్‌ పతనానికి బాటలు వేశాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్‌నే విజయం వరించింది. ఏడు పరుగుల తేడాతో సంజూ శాంసన్‌ సేన గెలుపొందింది.

తలెత్తుకోండి!
ఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్‌ సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తమ జట్టును ఉద్దేశించి భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు. ‘‘చాలా బాగా ఆడారు. శ్రేయస్‌ అయ్యర్‌, ఆరోన్‌ ఫించ్‌, ఉమేశ్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 150వ మ్యాచ్‌ ఆడిన సునిల్‌ నరైన్‌కు అభినందనలు.

15 ఏళ్ల క్రితం బ్రెండన్‌ మెకల్లమ్‌ ఇదే రోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం. మనం ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. కిందపడినపుడే మరింత పట్టుదలగా ముందుకు వెళ్లగలం. తలెత్తుకుని ఉండాలి మీరు’’ అని షారుఖ్‌ మంగళవారం ట్వీట్‌ చేశాడు.

రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
రాజస్తాన్‌- 217/5 (20)
కోల్‌కతా- 210 (19.4) 

చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్‌ అయ్యర్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా?’

>
మరిన్ని వార్తలు